AMARAVATHIAndhra Pradesh

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

వ్యవసాయ శాఖపై సీఎం జగన్ రివ్యూ.. అధికారులకు కీలక ఆదేశాలు

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు, సామర్థ్యం ఆమేరకు మెరుగుపడాలని ముఖ్యమంత్రి సూచించారు.  తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఈ–క్రాపింగ్, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బోర్లకింద, వర్షాధార భూములలో వరికి బదులు చిరుధాన్యాలు సాగుచేసినా ఆదాయాలు బాగా వస్తాయన్న అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం చెప్పారు. చిరుధాన్యాల సాగుచేస్తున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

నాణ్యత ఉన్నవాటిని రైతులకు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా కూడా రైతుల సమస్యలు నేరుగా ఉన్నతస్థాయి అధికారులకు తెలిసే వ్యవస్థను కూడా సిద్ధం చేయాలని సూచించారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఇందుకోసం వినియోగించుకోవాలని సీఎం పేర్కొన్నారు. నేచురల్‌ ఫార్మింగ్‌పైనా రైతులకు అవగాహన కల్పించాలని స్ఫష్టం చేశారు. నేచురల్‌ ఫార్మింగ్‌విధానాలను డిస్‌ప్లే చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన సామగ్రి కావాలంటే వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  ఆర్బీకే కేంద్రాలకు అనుబంధ భవనాలను విస్తరించుకుంటూ చిన్నపాటి గోడౌన్లను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నిల్వచేసుకోవచ్చని పేర్కొన్నారు. భవనాలను విస్తరించి నిర్మించేంతవరకూ అద్దె ప్రాతిపదికన కొన్ని భవనాలు తీసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబరులో వైయస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఆర్బీకేల పనితీరుమీద కూడా సర్టిఫికెషన్‌ ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్బీకేల పనితీరుపె నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉండాలని సీఎం ఆదేశించారు.ఆర్బీకేల పనితీరును మెరుగుపరిచే దిశగా ఐఎస్‌వో సర్టిఫికేషన్‌ పొందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దీనివల్ల వాటి పనితీరు క్రమంగా మెరుగుపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు ఎస్‌ఓపీలను రూపొందించుకోవాలని సీఎం కోరారు.  రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి వరకూ సాధారణ వర్షపాతం 403.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకూ 421.7 మిల్లీమీటర్లు కురిసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే ఖరీఫ్‌లో ఇవాల్టి వరకూ 76.65లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకూ 67.41 లక్షల ఎకరాల్లో సాగయ్యిందని చెప్పారు.

ఈ– క్రాపింగ్‌పైనా సీఎం సమీక్ష

ఈ– క్రాపింగ్‌ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్‌ రశీదులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ– క్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు.  దీనివల్ల పూర్తి పారదర్శకత వస్తుందని అభిప్రాయపడ్డారు. రుణాలు, సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పంటల కొనుగోలు, బీమా… తదితర వాటన్నింటికీ ఈ– క్రాపింగ్‌ ఆధారం అవుతుందని సీఎం చెప్పారు. అన్ని ఆర్బీకేల్లో బ్యాకింగ్‌ కరస్పాండెంట్లు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!