విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్ గందరగోళం ! నిన్న రద్దు..మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?

విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్ గందరగోళం ! నిన్న రద్దు..మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో విద్యుత్ ట్రూ అప్ చార్జీల ఉత్తర్వులను రద్దు చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఉత్తర్వులు ఇవ్వడంతో కోర్టుల్లో కేసులు పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ వచ్చే నెల వడ్డించే అవకాశం ఉంది.ట్రూ అప్ పేరుతో గత రెండు నెలలుగా అదనంగా వసూలు చేస్తున్న చార్జీలను హఠాత్తుగా ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ట్రూ అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఛార్జీల పెంపు విషయంలో సరైన పద్ధతి పాటించలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. దీంతో నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనందున హైకోర్టులో ఎదురు దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతో ట్రూ అప్ చార్జీలపై ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు.నిబంధనల ప్రకారం ట్రూ అప్ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి ఇచ్చే ముందు ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. కానీ అలాంటిదేమీ చేయకుండానే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీనిపై తుది ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చుల కింద.. వినియోగదారుల నుంచి రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు నుంచి వీటి వసూలు మొదలైంది. ఈ చార్జీల విధింపుతో బిల్లులు భారీగా వస్తుండడంతో వినియోగదారుల్లో గగ్గోలు మొదలైంది.నిబంధనల ప్రకారం ట్రూ అప్ చార్జీల విధింపునకు ముందు స్థానిక దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ పత్రికల్లో ఏ సమాచారం ప్రచురించకుండా చార్జీల విధింపు పై నిర్ణయం తీసుకున్నారని ఈ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తప్పు జరిగిందని ఈఆర్‌సీ గుర్తించింది. వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకుంది. అయితే ఈ చార్జీలు తగ్గింపు తాత్కాలికమే. వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఈఆర్‌సీ మరో ఉత్తర్వులో పేర్కొంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. ట్రూ అప్ చార్జీల వసూలుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో .. రెండు నెలలుగా వసూలు చేస్తున్న చార్జీలను వెనక్కి ఇస్తారా అన్న సందేహం వినియోగదారుల్లో ప్రారంభమయింది. ఎలా చూసినా ఆ చార్జీల వసూలు నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. హైకోర్టులో జరిగే విచారణలో ఏం జరుగుతుందో కానీ.. ట్రూ అప్ చార్జీలు మాత్రం ఈ నెల 19న ప్రజాభిప్రాయసేకరణ తర్వాత ఏపీఈఆర్సీ పెంచుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వచ్చే నెలలో మళ్లీ ట్రూ అప్ చార్జీలు మళ్లీ పెరుగుతాయన్నమాట