International

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, నాలుగు నగరాల్లో కాల్పులకు రష్యా తాత్కాలిక విరామం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, నాలుగు నగరాల్లో కాల్పులకు రష్యా తాత్కాలిక విరామం

క్యాపిటల్ వాయిస్, అంతర్జాతీయం :-ఉక్రెయిన్‌ తో యుద్ధం నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా శ‌త్రు దేశాల జాబితాను పుతిన్ విడుద‌ల చేశారు. ఆ జాబితాలో 31 దేశాలున్నాయి. ఈ విష‌యాన్ని ర‌ష్యా మీడియా వెల్ల‌డించింది.ఉక్రెయిన్,అమెరికా, బ్రిట‌న్‌,ఈయూ దేశాలతో పాటు కొరియా, తైవాన్,ఆస్ట్రేలియా,కెనడా,అండోరా,అల్బేనియా,మైక్రోనేషియా,లిచెన్స్టిన్,ఐస్ ల్యాండ్, మొనాకో, న్యూజిలాండ్,నార్వే,శాన్ మారినో,నార్త్ మెసడోనియా, సింగపూర్, మాంటినెగ్రో, స్విట్జర్లాండ్,జపాన్ దేశాల రష్యా శత్రుదేశాల లిస్ట్ లో ఉన్నాయి.ఇక,ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాపై అనేక దేశాలు,సంస్థలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్యాపై అమెరికా అనేక ఆంక్ష‌లు విధించింది. ఆంక్ష‌లు విధించాల‌ని మ‌రికొన్ని దేశాల‌కు కూడా సూచించింది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌ తో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రిని కూడా అమెరికాలోకి రానివ్వ‌కుండా జోబైడెన్ నిషేధం విధించారు. దీంతో పాటు ర‌ష్యాకు సంబంధించిన బ్యాంకుల‌పై కూడా అమెరికా ఆంక్ష‌లు విధించింది. ర‌ష్యా విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి రాకుండా కూడా అమెరికా నిషేధం విధించింది. ర‌ష్యా విమానాలు త‌మ గ‌గ‌న‌త‌లంలోకి రావొద్ద‌ని యూరోపియ‌న్ దేశాలు తేల్చి చెప్పాయి. త‌మ దేశంలో ఉన్న ర‌ష్యా కుబేరుల అకౌంట్ల‌ను కూడా సీజ్ చేశాయి.ర‌ష్యాకు చెందిన ఐదు బ్యాంకులు, కుబేరుల‌పై బ్రిట‌న్ ఆర్థిక ఆంక్ష‌ల‌ను విధించింది. ర‌ష్యా ప్ర‌భుత్వ అధీనంలో ఉండే ఎయిరోలోఫ్ట్ కంపెనీకి చెందిన విమానాలపై నిషేధం విధించింది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌కు సంబంధించిన ఆస్తుల‌ను కూడా జ‌ప్తు చేస్తున్న‌ట్లు బ్రిట‌న్ ప్ర‌క‌టించింది.ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో తటస్థ వైఖరి అవలంబిస్తామన్న భారత్‌.. సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. ఇదే సమయంలో చైనా మాత్రం రష్యా తీరును ఖండించలేమని మరోసారి స్పష్టం చేసింది. రష్యా తమకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక భాగస్వామి అని ఉద్ఘాటించింది. అయితే, అవసరమైన సమయంలో ఆ రెండు దేశాల మధ్య మధ్య వర్తిత్వం వహించేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా వెల్లడించింది.మరోవైపు, టర్కీ తీసుకున్న చొరవతో ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. అంటల్యా డిప్లొమసి ఫోరం వేదికగా మార్చి 10న శాంతి చర్చలు జరిపేందుకు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సిద్ధమైనట్లు టర్కీ తెలిపింది. ఇందులో తాము భాగం అవుతామని టర్కీ పేర్కొంది. ఈ ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దారితీస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. రష్యా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.ఇక,ఉక్రెయిన్ పై దాడులకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించింది రష్యా. మిలిటరీ, క్షిపణి, వైమానిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌ ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పారిపోతుండగా మార్గమధ్యలో కొందరు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా నాలుగు నగరాల్లో కాల్పులకు రష్యా తాత్కాలిక విరామం ప్రకటించింది. ఆ దేశంలోని అనేక నగరాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా మానవతా కారిడార్ ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా పేర్కొంది. కీవ్, ఖర్కివ్, మారియుపోల్, సుమీ నగరాలకు ఈ కాల్పుల విరమణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అమలును డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!