తెలుగుదేశం పార్టీలో బాలయ్య కొత్త బాధ్యతలు తీసుకోనున్నారా …. !?

తెలుగుదేశం పార్టీలో బాలయ్య కొత్త బాధ్యతలు తీసుకోనున్నారా …. !?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఎట్టి పరిస్థితుల్లోను అధికారాన్ని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటినుంచే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు వరకు అభ్యర్థులను ఖరారు చేసేవారుకాదు. ఈ నాన్చుడు ధోరణితో భారీగా నష్టపోయారు. ఈసారి తనను తాను మార్చుకుంటూ పార్టీని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.తనకున్న మొహమాటాన్ని వదిలించుకోవడంతోపాటు గెలుపు గుర్రాలనుకున్నవారికే టికెట్లు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా కొంతమంది ఇన్‌ఛార్జిలకు ముందుగానే చెప్పేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దీంతో చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని, అసంతృప్తులెవరైనా ఉంటే ముందే తెలిసిపోతుందని, తద్వారా పార్టీని మరింత పటిష్టపరుచుకోవచ్చని యోచిస్తున్నారు.పార్టీ విజయకేతనం ఎగరవేయాలంటే ప్రచారం ముఖ్యమైంది. అభ్యర్థులను ఎంపిక చేయడం ఒక ఎత్తయితే.. ప్రచారం మరో ఎత్తు. ఈసారి చంద్రబాబు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుతం వైసీపీ హవా కొనసాగుతోంది. కానీ ప్రజల్లో వ్యతిరేకత కూడా ఇక్కడే ఎక్కువగా వ్యక్తమవుతోందని భావిస్తోన్న చంద్రబాబు తరుచుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆయన ప్రచారానికి భారీగా స్పందన వస్తోంది.రాయలసీమలో కథానాయకుడు బాలకృష్ణకు అభిమానుల సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతం నేపథ్యంలో ఆయన ఎక్కువ సినిమాలు చేయడంవల్ల ఇక్కడివారంతా బాలయ్యను తమ సొంత వ్యక్తిగా భావిస్తారు. దీంతో రాయలసీమ ప్రచార బాధ్యతలు బాలకృష్ణకు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రం మొత్తంమీద బాలకృష్ణను ప్రచారం చేయించడంకన్నా పూర్తిగా రాయలసీమమీదే దృష్టి కేంద్రీకరించేలా చేయాలనేది బాబు ప్రణాళికగా ఉంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాలన్నీ రాయలసీమలోనే ఉన్నాయి. వాటిలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోగలిగితే రాష్ట్రంలో అధికారాన్ని చేజక్కించుకోవడం సులభమనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకు బాలయ్య అయితేనే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. తాను ప్రచారం చేసినా ఎక్కువ బాధ్యతను ఆయన బాలకృష్ణపై పెట్టబోతున్నారు. మరి తన బాధ్యతను బాలయ్య ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాం.!!