తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన……భారీ వర్షాలు …జర జాగ్రత్త !?

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన……భారీ వర్షాలు …జర జాగ్రత్త !?
క్యాపిటల్ వాయిస్ (అమరావతి,హైదరాబాద్ డెస్క్) :– ఆంధ్రప్రదేశ్ లో మరల వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందనివాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది అంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 88 మిల్లి మీటర్లు, అనకాపల్లిలో 60.8, గుంటూరు జిల్లాలాంలో 49, చిత్తూరు జిల్లా శాంతిపురంలో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 36.4, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 30.2, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 29, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 20 మిల్లీ మీటర్ల వర్షపాంత నమోదైంది. ఉత్తరాంధ్రతో పాటుగా రాయలసీమలోని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి.వానలు సంగతి అలా ఉంటే… కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విచిత్రంగా సెప్టెంబర్‌లో వానలు పడాల్సింది పోయి ఎండల ప్రభావం కనిపించడంతో జనాలు అల్లాడిపోతున్నారు. గతంలో కూడా అదే జరిగింది.. జులైలో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత ఆగస్టులో విచిత్రంగా ఎండలు, ఉక్కపోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సెప్టెంబర్‌లో మాత్రం వానలు పడతాయని అంచనా వేశారు. కానీ పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగానే ఉందని చెప్పాలి. మొదటి 10 రోజుల పాటూ వర్షాలు కురిసినా మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో కొన్ని చోట్ల సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని సూచించింది. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. త్వరలో నైరుతి రుతుపవనాలుతిరోగమనం కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 6-12 మధ్య వీడే అవకాశం ఉందంటున్నారు. రాగల రెండురోజుల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వివరించింది.