తహశీల్దార్ పై దాడి….. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్.ఐ రాంబాబు

తహశీల్దార్ పై దాడి….. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ రాంబాబు
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) యడ్లపాడు :- మండల తహశీల్దార్ శ్రీనివాసరావు ఓ యువకుడు ఇనుపరాడ్డుతో దాడికి పాల్పాడ్డాడు. తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత యువకుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన యువకుడు గోనుగుంట్ల క్రాంతికుమార్ వచ్చాడు. తన పొలం విషయం తహసీల్దార్‌తో మాట్లాడేందుకు ఆయన ఉన్న గదికి వెళ్లాడు. గతంలో తన పెదనాన్న పేరుతో ఉన్న 50 సెంట్ల పొలం ఆయన మరణానంతరం తన తండ్రి పేరుమీదకు ఆన్ లైన్‌లో ఎక్కిందని ఆ తర్వాత తన పేరుమీదకు ఆన్‌లైన్‌లో నమోదు కావలసి ఉన్నప్పటికీ ఫోర్జరీ ధృవపత్రాలు సృష్టించి తన మేనత్త కుమారుడు చిన్నశ్రీరాములు తన పేరుమీదకు ఎక్కించుకున్నాడని ఫిర్యాదు చేశాడు. 2018లో అప్పటి తహసీల్దార్ ఆన్‌లైన్ చేశారని, ఆ విషయం న్యాయస్థానంలో తేల్చుకోవాలని ప్రస్తుత తహసీల్దార్ శ్రీనివాసరావు క్రాంతికుమార్‌కు సూచించారు. తన పేరుతో నమోదు కావలసిన పొలం ఆన్‌లైన్‌లో ఎక్కలేదని వాపోతూ సహనం కోల్పోయిన క్రాంతికుమార్ తహసీల్దార్ శ్రీనివాసరావుపై ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. గాయపడిన తహసీల్దార్ యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్ ఐ రాంబాబు యువకుడు క్రాంతికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.