సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ మంటలు – ఆందోళనలో జగన్ ప్రభుత్వం ….. !?

సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ మంటలు – ఆందోళనలో జగన్ ప్రభుత్వం ….. !?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ 95 శాతం హామీల సంగతేమో కానీ మరో 5 శాతం హామీల్లో కీలకమైన ఓ హామీ మాత్రం వారిని కలవరపెడుతోంది. ఈ హామీ అమలు చేయకపోతే మాత్రం ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పేలా లేదు. అయితే ఈ హామీ అమలు చేసే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోంది.ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. వాటని జగన్ అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకంతో జనం భారీ ఎత్తున వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసి గెలిపించారు. దీంతో అనుకున్నట్లుగానే వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ 95 శాతం మేర హామీలు అమలు చేయడం జరుగుతున్నాయి. అయితే మిగిలిన ఐదు శాతం హామీల్లో ఓ హామీ మాత్రం కీలకంగా మారిపోయింది. ఈ హామీ అమలు కాకపోతే మాత్రం ఉద్యోగులు వదిలిపెట్టేలా లేరు. దీంతో ఈ హామీపై ఏం చేయాలో ప్రభుత్వ పెద్దలకు పాలుపోవడం లేదు.ఉద్యోగుల సీపీఎస్ రద్దు కోసం వైసీపీ గతంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని వైఎస్ జగన్ తన పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయాక దీన్ని అమలుచేయలేమని, అప్పట్లో దీని గురించి తెలియక హామీ ఇచ్చామని స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో సజ్జల ప్రకటన ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఆ తర్వాత ప్రభుత్వం జీపీఎస్ పేరుతో మరో ప్రత్యామ్నాయం తెద్దామని ప్రయత్నించినా ఉద్యోగులు దానికీ ఒప్పుకోవడం లేదు. పాత తరహాలోనే ఉద్యోగులకు ఓపీఎస్ విధానమే అమలుచేయాలని పట్టుబడుతున్నారు.వైసీపీ సర్కార్ సీపీఎస్ రద్దుపై ఉద్యోగులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో పలుమార్లు వారితో చర్చలు జరిపింది. అయితే ఉద్యోగులకు మాత్రం సీపీఎస్ రద్దుపై ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అదే సమయంలో జీపీఎస్ ను తెరపైకి తెచ్చింది. దీనికీ ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వాన్ని నిర్ధిష్ట హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నివాసం ముట్టడికి మిలియన్ మార్చ్ గా వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం కమిటీలు తయారు చేసుకుని మరీ మిలియన్ మార్చ్ విజయవంతానికి సిద్ధమవుతున్నారు. దీంతో ప్రభుత్వంలో టెన్షన్ పెరుగుతోంది.సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న ఉద్యోగులు చేపట్టిన మిలియన్ మార్చ్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఓవైపు సీపీఎస్ రద్దు చేసే అవకాశం లేకపోవడంతో మిలియన్ మార్చ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పోలీసులతో హెచ్చరికలు చేయిస్తోంది. గతంలో ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యోగులకు నోటీసులు కూడా పంపుతోంది. తద్వారా ఉద్యోగుల్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వారు మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్దంగా లేరు. దీంతో సెప్టెంబర్ 1న ఏం జరగబోతోందనే టెన్షన్ పెరుగుతోంది. ఉద్యోగుల ఆందోళనను అడ్డుకునేందుకు ప్రభుత్వం తుది విడతగా ఏమైనా చర్చలు జరుపుతుందా, వారిని ఒప్పిస్తుందా లేదా ఉక్కుపాదంతో ఆందోళన అణచివేస్తుందా అన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు ఎదుర్కోవాల్సిన పరిస్ధితుల్లో జగన్ సర్కార్ కు ఇది టర్నింగ్ పాయింట్ కాబోతోందా అన్న చర్చ కూడా జరుగుతోంది.