సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం – పొగతో ఊపిరాడక 7 గురు మృతి

సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం – పొగతో ఊపిరాడక 7 గురు మృతి
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో అయిదంతస్తుల భవనం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 8.45 సమయంలో షోరూమ్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్‌తో ఓ ఈ-స్కూటర్ పేలిపోయింది. చూస్తుండగానే మంటలు ఇతర వాహనాలకు వ్యాపించి, ఒక్కొక్కటిగా పలు వాహనాలు భారీ శబ్దంతో పేలిపోయాయి. . వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉధృతి మరింత పెరిగింది.వెంటనే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్‌లో 25 మంది బసచేసినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు దుర్మరణం చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే.. అప్పటికే షోరూం, గోదాము అగ్నికి ఆహుతయ్యాయి. హోటల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 54 మీటర్ల నిచ్చెన ఉండే వాహనంతోపాటు.. 5 ఫైరింజన్లు, స్మోక్ ఇస్టింగ్విషర్ వాహనాలు, రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. పైఅంతస్తుల్లోని హోటల్ లో చిక్కుకున్న వారిని కాపాడారు.