National

సాగుదారుగా అధికార ధృవీకరణ ఉంటేనే ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం యోచన…!?

సాగుదారుగా అధికార ధృవీకరణ ఉంటేనే ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం యోచన…!?

భూ రికార్డుల్లో  నమోదు తప్పనిసరి.. కౌలు రైతులకు తీరని నష్టం
ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ కూడా..కేంద్రం కసరత్తు

క్యాపిటల్ వాయిస్,  అమరావతి :- సాగుదారుగా అధికార ధృవీకరణ ఉంటేనే ఎరువుల సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం తీవ్రంగా యోచిస్తోంది. ‘పిఎం కిసాన్‌’ సహాయానికి మల్లే భూమి రికార్డులకు ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్లను అనుసంధానం చేసుకున్న రైతులనే ఎరువుల రాయితీకి అర్హత సాధించే విధంగా పక్కా వ్యవస్థను రూపొందించాలని ప్రయత్నిస్తోంది. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఆన్‌లైన్‌ ధృవీకరణ అని పైకి చెబుతున్నప్పటికీ అసలు లక్ష్యం మాత్రం సబ్సిడీ నిధులకు కోతలు పెట్టేందుకేనని తెలుస్తోంది. భూ రికార్డుల్లో నమోదైన రైతులకే ఎరువుల సబ్సిడీ అందే విధానం అమల్లోకొస్తే కోట్లాది వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రభావం కౌలు సేద్యం అంతకంతకూ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా పడే అవకాశం ఉంది. కేంద్ర విధానంతో సాగు చేయని భూ యజమానులకు ఎం చక్కా సర్కారీ రాయితీ అందుతుంది.ఆధార్‌, ఓటర్‌ ఐడి చూపించి ఎరువులు కొనుక్కొనే వారందరూ రైతులేనా? వారికి భూమి ఉందా? అనే ఆలోచనలో కేంద్రం తలమునకలైంది. భూమి రికార్డుల్లో నమోదైన వారికే ఎరువుల సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టాలని చూస్తోంది. ఇప్పటికే నీతి ఆయోగ్‌, ప్రధాన మంత్రి కార్యాలయ (పిఎంఒ) స్థాయిలో చాలా సమావేశాలు జరిగాయి. 2020-21 ఎరువుల సబ్సిడీ పద్దుపై అధ్యయనం చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘంలోనూ చర్చించి సిఫారసు చేశారు. రెవెన్యూ శాఖ నిర్వహించే భూమి రికార్డుల్లో పేరు ఎక్కిన రైతు సర్వే నెంబర్‌ ఖాతాకు ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లను అనుసంధానం చేయాలంటోంది కేంద్రం. భూమి రికార్డుల వ్యవహారం రాష్ట్రాలది కనుక రాష్ట్రాలు సహకరించా లని కోరుతోంది. కాగా కౌలు రైతులు వేరొకరి భూములను సాగు చేస్తారు. రికార్డుల్లో యజమానుల పేర్లతో భూమి ఉంటుంది. యజమానులు సహకరిస్తేనే కౌలు రైతులు ఎరువులు కొనుక్కోగలుగుతారు. ఇదిలా ఉండగా ఎరువుల సబ్సిడీలో డిబిటిపై కేంద్రానికి కొత్త చిక్కొచ్చి పడింది. కాంట్రాక్టు సేద్యాన్ని బాగా పెంచి కార్పొరేట్లకు ఊతం ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవసాయ చట్టాలను తెచ్చింది. కాంట్రాక్టు సేద్యం పరిధిలోకి పెద్ద పెద్ద భూఖండాలు వస్తాయి. అలాంటప్పుడు కాంట్రాక్టు సంస్థకు ఎరువుల సబ్సిడీ ఎలా ఇవ్వాలనే విషయంపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం కౌలు రైతులను ఎలా గుర్తించాలనే అంశం సవాల్‌గా ఉందని చెబుతూ, అందుకు ఎపి కౌలు రైతుల చట్టాన్ని అధ్యయనం చేస్తున్నారు. కౌలు రైతులు, భూమి యజమానుల పేర్లను వేరు చేసే ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎపిలో రైతు భరోసా, సున్నా వడ్డీ, పంటల బీమా, పంటల కొనుగోళ్లు, సీడ్‌ సబ్సిడీ, యంత్ర పరికరాలు, విపత్తు పరిహారం అన్నింటికీ వెబ్‌ ల్యాండ్‌ డేటా, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ తప్పనిసరి. దాంతో కౌలు రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోతున్నారు. ఇక ఎరువుల సబ్సిడీ సైతం దక్కదు.ప్రతి ప్రభుత్వ పథకంలో నగదు బదిలీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌-డిబిటి) అంటోంది మోడీ ప్రభుత్వం. రైతుల ఎరువుల సబ్సిడీకి 2016 అక్టోబర్‌లో మొదలుపెట్టగా దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో 2018 మార్చి నుండి అమల్లోకొచ్చింది. డిబిటి రాక మునుపు కేంద్రం ఎరువుల కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు రైతులు ఎంత మేరకు ఎరువులను కొనుగోలు చేస్తారో ఆ లెక్కలనుబట్టి కంపెనీలకు చెల్లిస్తోంది. ప్రతి రిటైల్‌ షాపులో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఒఎస్‌) డివైస్‌ను ఏర్పాటు చేసి బయోమెట్రిక్‌లో రైతు వేలిముద్రలు తీసుకొని ఎరువులు విక్రయించే పద్ధతి వచ్చింది. ప్రస్తుతానికి ఆధార్‌, ఓటర్‌ గుర్తింపు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు చూపించి ఇ-పోస్‌ మిషన్‌లో వేలిముద్ర వేసి రైతులు ఎరువులు కొనుక్కుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!