AMARAVATHIAndhra Pradesh

ఆర్కే మరణం ప్రభుత్వ హత్యే… మావోయిస్టుల ఆహారంలో విషం కలుపుతున్నారు… ఆర్కే భార్య శిరీష ఆరోపణ..!

ఆర్కే మరణం ప్రభుత్వ హత్యే… మావోయిస్టుల ఆహారంలో విషం కలుపుతున్నారు… ఆర్కే భార్య శిరీష ఆరోపణ..!

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- కామ్రేడ్ ఆర్కే మరణాన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని ఆయన సతీమణి శిరీష అన్నారు. ఆపరేషన్ సమాధాన్ తో మావోయిస్టులకు వైద్యం అందకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.సీపీఐ(మావోయిస్టు) అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. తన భర్త ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష మీడియాతో మాట్లాడారు. దీనిని ప్రభుత్వ హత్యగానే భావిస్తామని శిరీష చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టులకు వైద్యం అందనివ్వడం లేదని ఆరోపించారు. మావోయిస్టులకు అందే ఆహారంలో విషం కలుపుతున్నారన్నారు. ఆర్కే విషయంలో విషప్రయోగం జరిగి ఉండొచ్చని ఆయన భార్య శిరీష అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టు నేత ఆర్కే ప్రజల కోసం తన జీవితాన్నే ధారపోశారన్నారు. ఆర్కే మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో ఉంటున్న శిరీష ఆర్కే మృతదేహాన్ని చూసే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఆర్కే భార్య శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు. కామ్రేడ్ అక్కిరాజు హరగోపాల్ (63) అనారోగ్యంతో అక్టోబరు 14వ తేదీ ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచాడని మావోయిస్టుల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన జారీచేసింది. హరగోపాల్ కు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైందని తెలిపారు. వెంటనే డయాలసిస్ ట్రీట్మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి ఆర్కే అమరులయ్యారని ప్రకటించారు. ఆయనకు పార్టీ మంచి వైద్యం అందించినప్పటికీ దక్కించుకోలేకపోయమన్నారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.
ఆపరేషన్ సమాధాన్….
ఆర్కే విప్లవకారుడిగా జీవించి, విప్లవకారుడిగానే మరణించారని విరసం నేత కల్యాణరావు అన్నారు. ఆర్కే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఆర్కే ఆశయ సాధనను కొనసాగిస్తామన్నారు. పోలీసులు ఆర్కేకు వైద్యం అందకుండా చేశారని చెప్పారు. ప్రజల కోసమే ఆర్కే ప్రాణాలు అర్పించారన్నారు. ఆపరేషన్ సమాధాన్ పేరుతో ప్రభుత్వాలు మావోయిస్టులను అణచి వేస్తున్నారని విరసం నేత పినాకపాణి ఆరోపించారు. మావోయిస్టులను వైద్యం అందకుండా ఆపరేషన్ సమాధాన్ చేపట్టారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!