Telangana
రేపు బీహార్ పర్యటనకు కేసీఆర్ – జాతీయ రాజకీయాల దిశగా మరో సరికొత్త అడుగు !

రేపు బీహార్ పర్యటనకు కేసీఆర్ – జాతీయ రాజకీయాల దిశగా మరో సరికొత్త అడుగు !
క్యాపిటల్ వాయిస్, తెలంగాణ :- కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా మరో అడుగు వేయనున్నారు. ఈ నెల 31న బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం (ఆగస్టు 31) ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా వెళ్లనున్న సీఎం కేసీఆర్.. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో భేటీ అవుతారు. ఆయనతో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం ఇరువురు కలిసి లంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.బీహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ తాను గతంలో ప్రకటించిన మేరకు గాల్వాన్ ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. బీహార్‌కు చెందిన ఐదుగురు అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి సీఎం నితీశ్ కుమార్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. సైనిక కుటుంబాలతో పాటు.. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేయనున్నారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు.