రాజధాని అమరావతి నిర్మాణం ఎంత వరకు వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రాజధాని అమరావతి నిర్మాణం ఎంత వరకు వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- రాజధాని అమరావతి పై దాఖలైన కేసుల పై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు జరిగిన అమరావతి పనుల్లో జరిగిన పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ రాజధాని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తీర్పును అమలు చేయట్లేదని రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు..అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12 కు వాయిదా వేసింది.మరింత వివరాల్లోకి వెళితే.. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని అమరావతి రైతులు గతంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు బాధ్యులైన అధికారులు, ప్రభుత్వ పెద్దలను శిక్షించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అప్పటి పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఇతర అధికారులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ (వైసీపీ ప్రభుత్వం) ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ (మూడు రాజధానులు) చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల పై విచారణ జరిపిన హైకోర్టు మార్చి లో తుది తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలి. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లు అమలు చేయాలి. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదు. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరు. అధికారం లేనప్పుడు సీఆర్డీఏ చట్టం రద్దు కుదరదు. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్ని తరలించకూడదు. పిటిషనర్ల అందరికీ ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలి అని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం పాటించడం లేదని రాజధాని రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.