Andhra Pradesh

ప్రత్యర్దులకు ఇక అవకాశం లేదు – వేగం పెంచి పావులు కదుపుతున్న జగన్ !

ప్రత్యర్దులకు ఇక అవకాశం లేదు – వేగం పెంచి పావులు కదుపుతున్న జగన్ !

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఇటు ప్రభుత్వ పరంగా, అటు పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కొత్త పథకాలను ప్రవేశ పెడితే జనం నమ్మరని భావించిన జగన్ రెండేళ్ల ముందు నుంచే తాను అనుకున్న ప్రకారం పథకాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాలను వచ్చే నెల 1వ తేదీ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ మరింత స్పీడ్ పెంచాలని సిద్ధమయ్యారు. తాము చెప్పినట్లుగానే 98.44 శాతం మ్యానిఫెస్టోను అమలుపర్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి వివిధ పథకాల కింద 1.50 లక్షల కోట్ల రూపాయలను వివిధ వర్గాల ప్రజలకు నేరుగా నగదు రూపంలో అందించారు. ఇక ఆరోగ్యశ్రీ వంటివి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఐదు లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింప చేయడంతో పాటు వ్యాధుల సంఖ్యను కూడా పెంచి అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.గతంలో ఉన్న పథకాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెళ్లి కానుక ఉన్నప్పటికీ లబ్ధిదారులకు అందించే సొమ్మును మరింత పెంచారు. మార్గదర్శకాల్లోనూ మార్పులు చేశారు. పాత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా డిజైన్ చేస్తున్నారు. అర్హులైన అందరికీ రెండేళ్ల పాటు పథకాలను అందించాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ప్రత్యర్థులు ఏకమై వస్తారని తెలుసు. అందరూ ఏకమై వచ్చినా ఎక్కువ మంది ప్రజలు తన వెంట ఉండేలా జగన్ ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వేరే పార్టీకి ఓటేస్తే ఈ పథకాలు అందవేమోనన్న భయాన్ని జనంలో జగన్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ రెండేళ్లు జగన్ ప్రభుత్వానికి కీలకం. ఒక వైపు ఆర్థికంగా ఇబ్బందులు. మరోవైపు పథకాలను ప్రజలకు అనుకున్నవి అనుకున్నట్లుగా చేర్చడం జగన్ కు కత్తిమీద సామేనని చెప్పక తప్పదు. ఇప్పటికే అప్పులు చేసి ప్రజలు పప్పు బెల్లాలను పంచినట్లు డబ్బులు పంచుతున్నారని జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఇలాంటి విమర్శలను జగన్ పట్టించుకోదలచుకోనట్లుంది. ఎవరు ఏమనుకున్నా తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతోనే ఆయన పని సాగుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఏపీ ప్రజలకు అందే అవకాశాలను కొట్టిపారేయలేం. వైరి పక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా ముందుగానే తాను అన్ని రకాలుగా జనాలను దరి చేర్చుకోవాలన్నది వైసీపీ అధినేత తాపత్రయంగా కనిపిస్తుంది.  రానున్న రోజుల్లో మరెన్ని పథకాలు గ్రౌండ్ కానున్నాయో చూడాలి మరి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!