ప్రభుత్వం కనికరించినా కనిగిరిలో ఆ అధికారి కనికరించలేదు…రూమ్‌కి తాళమేసి వెళ్లిపోయిన పాత కమిషనర్ !

ప్రభుత్వం కనికరించినా కనిగిరిలో ఆ అధికారి కనికరించలేదు…రూమ్‌కి తాళమేసి వెళ్లిపోయిన పాత కమిషనర్ !
క్యాపిటల్ వాయిస్, (ప్రకాశం జిల్లా) కనిగిరి :- ప్రభుత్వం కనికరించినా.. కనిగిరిలో ఆ అధికారి కనికరించలేదు. పాపం.. నగరపంచాయతీకి కొత్త కమిషనర్‌గా వచ్చిన వ్యక్తి ఎన్నిసార్లు ఆఫీస్‌కి వచ్చినా బాధ్యతలు తీసుకునే భాగ్యం లేకుండా పోయింది. కారణం పాత కమిషనర్ నారాయణరావు. నగర పంచాయతీకి కొత్త కమిషనర్‌గా భీమవరం నుంచి బదిలీ అయ్యి వచ్చారు కృష్ణారావు. కానీ అక్కడే తిష్ట వేసిన పాత కమిషనర్ నారాయణరావు మాత్రం రిలీవ్ అవ్వడం లేదు. ఎంతకీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఉన్నతాధికారుల జోక్యంతో కాస్త తగ్గి అక్కడి నుంచి బదిలీ అయిన విజయవాడ వెళ్లి అక్కడ పనిచేసుకుంటున్నాడుగానీ, కనిగిరి కమిషనర్ ఆఫీస్‌రూమ్‌కి మాత్రం తాళం వేసుకెళ్లారు. నారాయణరావు వెళ్లిపోయారు కదాని కృష్ణారావు ఇప్పటికి మూడుసార్లు వచ్చి వెళ్లినా రూమ్‌కి ఉన్న తాళం మాత్రం తీసేవాళ్లు లేరు. పక్క రూమ్‌లో మిగతా సిబ్బంది పనిచేసుకుంటున్నా.. ఆయనకు మాత్రం ఓ కుర్చీ, బల్ల లేకుండా పోయింది.విచిత్రం ఏంటంటే సిబ్బంది అంతా బదిలీ అయ్యి వెళ్లిపోయిన పాత కమిషనర్‌కే వత్తాసు పలుకుతున్నారు. వాళ్లకీ వాళ్లకీ ఏముందోగానీ.. కొత్తగా వచ్చిన కృష్ణారావు మాత్రం రోజూ రావడం, రూమ్ ముందు నిలబడటం, కాసేపు ఎదురుచూడటం వెళ్లిపోవడం.. ఇదే విధిగా మారిపోయింది.