ప్రభుత్వం కదలడం లేదని,……….16 గ్రామాల ప్రజా మద్దతుతో ఆ ఊరి ప్రజలే వంతెన కట్టేశారు !
క్యాపిటల్ వాయిస్, ప్రకాశం జిల్లా బ్యూరో :- ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఊరంతా కదిలింది. ప్రభుత్వం కదలడం లేదని, ఆ ఊరి ప్రజలే వంతెన కట్టేశారు. ‘కాలువ దాటేందుకు నానా అవస్థలు పడుతున్నాం, వంతెన కట్టండి’ అంటూ కాళ్లు అరిగేలా తిరిగారు. ప్రభుత్వం తమ సమస్యను తీరుస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అధికారులు, పాలక పెద్దలు రావడం, హామీలు ఇవ్వడమే తప్ప పనికావడం లేదని వారు చింతించని రోజు లేదు. దశాబ్దాలుగా సమస్య అలానే ఉండిపోతున్నా ప్రభుత్వం వైపు ఉలుకూ పలుకూ లేకపోవడంతో ఈ వర్షాకాలంలోనే సొంతంగా వంతెన కట్టేయాలని సంకల్పించారు.16 గ్రామాల ప్రజలు కలిసివచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 20 లక్షల చందా వసూలయ్యింది. దానికి తోడు శ్రమదానం కూడా చేశారు. సొంత ట్రాక్టర్లు, ఇతర వాహనాలను కూడా ఉపయోగించారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరించుకున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, కురిచేడు మండలాల సరిహద్దుల్లో కొత్తగా వెలిసిన ఈ కట్టడం రైతుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.త్రిపురాంతకం మండలం ముడివేముల, కురిచేడు మండలం ముష్ట గంగవరం మధ్య గుండ్లకమ్మ వాగు ప్రవహిస్తోంది. ఏటా సగం రోజుల పాటు ఎగువన కొండలపై నుంచి వచ్చే ప్రవాహం కారణంగా వాగు దాటాలంటే సామాన్యులకు పెద్ద సమస్యగా ఉండేది. కొంత కాలం పాటు కాలువ దాటించేందుకు మధ్యలో పడవ సహాయం తీసుకోవాల్సి వచ్చేది. పైగా పడవ మీద దాటించడానికి ప్రతీ మనిషికి కొంత మొత్తం కూడా వసులు చేయాల్సి వచ్చేది. టూ వీలర్లకు అదనంగా తీసుకునేవారు. త్రిపురాంతకం నుంచి జిల్లా కేంద్రం ఒంగోలు వైపు వెళ్లాలన్నా, ఇతర అవసరాలకు సమీపంలోని పది, పదిహేను గ్రామాల ప్రజలకు కూడా ఈ కాలువ దాటాల్సిన అవసరం ఉంది. దాంతో ఇక్కడ వర్షాల సమయంలోనూ, వాగు పొంగినప్పుడు అత్యంత సమస్యగా ఉండేది. “సమస్య తీర్చాలని స్థానికులు విన్నవించని అధికారి లేరు, కలవని నాయకుడు లేరు. వచ్చిన ప్రతీ ఒక్కరూ సమస్య నిజమైనదే. పరిష్కరిస్తాం అంటూ హామీ ఇచ్చిన వారే. ఒకరు కాదు, ఇద్దరు కాదు చాలామంది మంత్రుల స్థాయి నాయకులు, పెద్ద పెద్ద అధికారులు కూడా చూసి హామీలు ఇచ్చిన వారే. కానీ ఒక్క అడుగూ పడలేదు. మూడు, నాలుగు దశబ్దాలుగా ఎదురుచూస్తున్నాం. కానీ కార్యరూపం దాల్చలేదు. అందుకే ఇక రైతులంతా కదలాల్సి వచ్చింది”అన్నారు ముడివేముల గ్రామానికి చెందిన దేవినేని చలమయ్య. రోజూ సమస్య ఎదుర్కొంటున్న రైతులు, స్థానికులు అందరూ కలిసి వచ్చారని ఆయన బీబీసీకి తెలిపారు.ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇచ్చిన సమయంలో హామీలు మాత్రం వచ్చాయని, వంతెన పనులు మాత్రం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే సొంతంగానే పనులు చేయాలనే ఆలోచన రావడానికి ఎదురు చూసీచూసీ ఇక విసుగు చెందడమే కారణమని స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు పోటు అచ్చియ్య అన్నారు. పెద్దలంతా కలిసి నిర్ణయం తీసుకోగానే చాలామంది స్పందించారని ఆయన బీబీసీకి తెలిపారు. “ఏటా ఏడెనిమిది నెలల పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ ఇక్కడికొచ్చేసరికి పెద్ద సమస్యగా ఉండేది. ఏం చేయాలన్నది పాలుపోయేది కాదు. ఒక్కరే ఏమీ చేయలేరు కాబట్టి, అందరూ కలిసి సొంతంగా వంతెన కట్టాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు మొదట చందాలు వసూలు చేయాలని అనుకున్నాం. పెద్దలు తలో కొంత మొత్తం ఇచ్చారు. ఎవరు ఎంత ఇచ్చినా ఆ ఊరి కిందనే లెక్క అని అనుకున్నాం. అలా అన్ని ఊళ్ల వారిని కలిసినప్పుడు అందరూ స్పందించారు. మొత్తం రూ.20 లక్షలు వసూలయ్యింది. మొత్తం ఖర్చయిపోయింది. ఇంకా చిల్లర ఖర్చులకు అదనంగా కూడా పెద్దలు వేసుకున్నారు. పని పూర్తయ్యిందనే ఆనందం అందరిలో మిగిలింది” అని ఆయన వివరించారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఉన్న వారంతా వాటిని అద్దె లేకుండా మట్టి తోలడానికి, చదును చేయడానికి ఉపయోగించారని, అందుకే తక్కువ మొత్తానికే వంతెన పూర్తిచేయగలిగామని అచ్చియ్య అన్నారు.
ఇంజనీరింగ్ ప్లాన్ కూడా రైతుదే
వంతెన కట్టాలనే ఆలోచన చేసిన రైతులకు అసలు సమస్య ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎంత మేరకు కట్టాలి అనే ప్రశ్నలు వచ్చాయి. మండల ఇంజనీరింగ్ అధికారుల సలహా తీసుకుందామనే ప్రతిపాదన వచ్చింది. కానీ మళ్లీ అధికారుల వద్దకు వెళితే అనుమతులు అవీఇవీ అంటూ తమ ఆలోచనకు అడ్డుకట్ట వేస్తారేమోననే అనుమానం రైతులకు వచ్చింది. నూజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన గుజ్జా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఈ వంతెన నిర్మాణం బాధ్యత అప్పగించారు. ఇలాంటి నిర్మాణాలు జరగాలంటే తొలుత ఇంజనీరింగ్ నిపుణుల ప్లాన్, దానికి ఉన్నతాధికారుల ఆమోదం, మధ్యలో ప్రతిపాదనలకు కొన్ని మార్పులు, చేర్పులు వంటి తతంగం చాలా ఉంటుంది. అన్నీ పూర్తయిన తర్వాత మళ్లీ దానికి టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు రావడం, వాటిలో బిడ్ వేయడం, పనులు అప్పగించడం వంటి ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ అందుకు భిన్నంగా ఐదో తరగతి వరకు మాత్రమే చదివిన వెంకటేశ్వర్లుకు ఈ పనిని స్థానికులు అప్పగించారు. గతంలో బెంగళూరులో చిన్న చిన్న పనులు చేయించిన అనుభవం ఆయనకు ఉంది. పల్నాడు జిల్లా తంగిరాల వద్ద కూడా వంతెన పనుల్లో ఆయన పాల్గొన్నారు. దాంతో తన అనుభవాన్ని ఉపయోగించిన ఈ రైతు సహకారంతోనే వంతెన పూర్తి చేసేశామని చెబుతున్నారు. “నాకు పట్టాలేమీ లేవు. అనుభవమే ఉంది. కొన్ని వంతెన పనులు దగ్గరుండి చూశాను. కొన్ని చేయించాను. చిన్న చిన్న పనులు పూర్తి చేసిన అనుభవమే ఇక్కడ ఉపయోగపడింది. గ్రామస్థుల సహకారం కూడా మరువలేనిది. అందుకే వేగంగా పనులు జరిగాయి. 15 పైపులు వేసి వాటి మధ్య కాంక్రీట్‌తో పటిష్టంగా నిర్మించాము. వరదలు ఎక్కువ వస్తే నీరు పై నుంచి పోయినా పైపులు కదలకుండా గట్టిగానే వేశాము. కల్వర్టు తరహాలో ఇది కట్టాము. కాబట్టి ఢోకా ఉండదని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి రాకపోకలకు ఎటువంటి సమస్యా ఉండదు” అని వెంకటేశ్వర్లు బీబీసీతో చెప్పారు. కల్వర్టు, అప్రోచ్ రోడ్డు అంతా పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు పాటించామని ఆయన చెప్పారు.వంతెన వంటి నిర్మాణాలు ప్రారంభించినప్పుడు ఏ పథకం కింద కట్టారు, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ప్రారంభించారు అనే వివరాలతో శిలాఫలకం ఉంటుంది. కానీ ప్రస్తుతం జనవారధి అంటూ స్థానిక మీడియా ప్రస్తావించిన ఈ వంతెనని ఆగష్టు 24న ప్రారంభించారు. తమ చిరకాల వాంఛ నెరవేరిన సమయంలో సమీప గ్రామాల ప్రజలంతా సందడిగా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆవిష్కరించిన శిలాఫలకం మీద వంతెన నిర్మాణంలో భాగస్వాములయిన 16 గ్రామాల పేర్లు, ఆయా గ్రామాల్లో వసూలయిన చందాల వివరాలు పొందుపరిచారు. ఏ ఊరు ఉంచి ఎంత మొత్తం సహకారం అందిందనేది రాశారు. “మా ఊరి నుంచి నా బిడ్డ దగ్గరకి వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉండేదో. పడవకి అటూఇటూ రూ.20 అయ్యేది. ఎక్కువ నీరు వచ్చినా ఎప్పుడూ ప్రమాదం బారిన పడకుండానే దాటించారు. కానీ భయం ఉండేది. ఇప్పుడు ఎటువంటి సమస్యా లేదు. కాలి నడకన నా కూతురు ఇంటికి వెళుతున్నాను. వంతెన వచ్చింది కాబట్టి ఆటోలు, బస్సులు నడిస్తే మాకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది” అంటూ ముడివేముల గ్రామానికి చెందిన పెదపూడి అచ్చెమ్మ అనే మహిళ చెప్పారు. ఎలాంటి సమస్యా లేకుండా గుండ్లకమ్మ కాలువ దాటగలనని అనుకోలేదని, ఇప్పుడు తమ అనుభవంలోకి ఈ వంతెన రావడం ఆనందంగా ఉందని ఆమె మీడియాతో అన్నారు.
ప్రభుత్వాలకు ఇదో పాఠం కావాలి:
రైతు సంఘం ప్రభుత్వాలు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలనే ఆతృత తప్ప, ప్రజాప్రయోజనాలతో ముడిపడిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారనడానికి ఈ వంతెన వ్యవహారం ఓ ఉదాహరణ అంటూ ఏపీ రైతుసంఘం నాయకుడు ఎం రంగారావు అభిప్రాయపడ్డారు. “రైతులు తమ పంట అటూ ఇటూ తరలించాలన్నా చాలా సమస్య ఉండేది. కాలి నడకన వెళ్లడమే భారంగా ఉండే చోట ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తరలించడం ఎంత సమస్యగా ఉంటుందో ఆలోచించండి. అందుకే రైతులు సమష్టిగా కదిలారు. ప్రభుత్వాలకు ఇదో పాఠం కావాలి. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలే కదలాల్సి వస్తుందని చాటిచెప్పిన అనుభవం ఇది” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ గ్రామాలు ఎర్రగొండపాలెం, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి.