AMARAVATHIAndhra Pradesh
పీకే టీమ్ రెడీ…వచ్చే మార్చి నుంచి రంగంలోకి… రాష్ట్రమంతటా విస్తృత పర్యటన పాలన,పథకాలపై సర్వే….?

పీకే టీమ్ రెడీ…వచ్చే మార్చి నుంచి రంగంలోకి… రాష్ట్రమంతటా విస్తృత పర్యటన పాలన,పథకాలపై సర్వే….?
పింఛన్ల ఏరివేతపై టీడీపీ విషప్రచారం..
అనర్హులనే తొలగిస్తున్నాంప్రజలకు నిజాలు చెప్పండి..
అమాత్యులకు ముఖ్యమంత్రి నిర్దేశం !
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ 2022 మార్చి నుంచి రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. గురువారమిక్కడ వెలగపూడి సచివాలయంలో 39 అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించి ఆమోదించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అజెండా అంశాలు పూర్తయి.. అధికారులందరూ వెళ్లిపోయాక మంత్రులతో జగన్ మాట్లాడారు. పీకే బృందం రాష్ట్రమంతా పర్యటించి సమగ్ర సర్వే చేపడుతుందని ఆయన చెప్పడంతో మంత్రులు ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. తాము వింటున్నది నిజమేనా? జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారా.. అందుకే ముందుగానే పీకే టీమ్‌ను రంగంలోకి దించుతున్నారా అనే ప్రశ్నలు వారి మదిలోకి ప్రవేశించాయి. అంతలోనే ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సీఎం మాట్లాడడం ప్రారంభించారు. ‘ప్రభుత్వ పాలనపై సమగ్ర సర్వే చేయాలనుకుంటున్నాను. 2022 మార్చి నుంచి పీకే టీమ్ విస్తృతంగా పర్యటిస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. ప్రధానంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై వాకబు చేస్తుంది. ఈ సర్వే 2024 ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుంది’ అని ముక్తాయించారు. 2024 మాట వినగానే.. మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇంత తొందరగా. ఇంత ముందస్తుగా ఈ విషయాన్ని ఆయన ఎందుకు ప్రకటించారోనన్న అనుమానాలు వారి మనసుల్లో అలాగే మిగిలాయి. ప్రజలతో మమేకం కండి..‘ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా నవరత్నాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. అవి అర్హులందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకోండి. గ్రామ సచివాలయాల సందర్శనలో భాగంగా ప్రజలతో మమేకం కండి’ అని మంత్రులకు సీఎం ఈ సందర్భంగా కర్తవ్య బోధ చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూనే.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గట్టిగా ప్రచారం చేయాలన్నారు. ‘ప్రజల్లోకి వెళ్లండి. నేను కూడా వచ్చే ఏడాది నుంచి విస్తృతంగా వెళ్తాను. రాష్ట్రంలో పింఛన్లు ఏరివేస్తున్నామని టీడీపీ విష ప్రచారం చేస్తోంది. అనర్హులనే ఏరివేస్తున్నాం. ఇదే సమయంలో అర్హులైనవారిని గుర్తించి 90 రోజుల్లో పింఛన్లు అందించే కార్యక్రమాన్నీ చేపడుతున్నాం. వీటన్నిటి గురించీ ప్రజలకు వివరించండి. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అని పిలుపిచ్చినట్లు తెలిసింది. కేబినెట్ అజెండా సహా.. మంత్రివర్గంలో చర్చకు వచ్చిన విషయాలేవీ బయటపెట్టొద్దని ఆయన ఆదేశాలిచ్చారు.కొసమెరుపు: ‘అతి రహస్యం బట్టబయలు’ అనే సామెతను గురువారం నాటి కేబినెట్ సమావేశం నిరూపించింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన మంత్రులందరూ ఎవరికి వారు వెళ్లిపోయారు. ఎదురుపడ్డ మీడియా ప్రతినిధులతో అజెండా అంశాలు తప్ప ఇంకేమీ చర్చకు రాలేదని పనిగట్టుకుని మరీ చెప్పారు. కానీ ఏకాంతంగా కలిసినప్పుడు మాత్రం.. కొందరు మంత్రులు మనసులో భయాన్ని బయటపెట్టేశారు. ‘పీకే టీమ్ మార్చిలో వస్తుందట’ అని గుసగుసలాడుతున్నట్లుగా చెప్పేశారు. అంతే.. ఈ విషయం సామాజిక మాధ్యమాల చెవికి చేరిపోయింది.ఎమ్మెల్యేల్లో ఆందోళన, అభద్రత?పీకే టీమ్ పర్యటన గురించి జగన్ ప్రకటించిన వెంటనే.. కొందరు మంత్రుల్లో అసహనం వ్యక్తమైంది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సర్వే చేయడం ఎందుకని అంతర్గత సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాక కార్యకర్తల కంటే వలంటీర్లదే హవాగా మారిందని ఓ మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులకు విలువే లేకుండా పోయిందని మరో మంత్రి చెప్పారు. సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎవరు పట్టించుకుంటున్నారని ఇంకో మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లే సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని.. ప్రజా ప్రతినిధులకు జోక్యం చేసుకునే అవకాశం ఎక్కడుందని వేరే మంత్రి అభిప్రాయపడ్డారు. ఏమైనా ఇంత ముందస్తుగా సర్వే సమాచారం వెల్లడించి సీఎం శాసనసభ్యుల్లో ఆందోళనకు తెరతీశారని.. భవిష్యత్‌పై అభద్రతాభావం కల్పించారని ఒక మంత్రి అన్నారు.