AMARAVATHIAndhra Pradesh
పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు : మంత్రి అనిల్

పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదు : మంత్రి అనిల్
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ ఉన్న పరిస్థితి ఇప్పుడు.. పవన్ వర్సెస్ ఏపీ సర్కార్ గా మారుతోందా..? ఏపీలో ఏం జరుగుతోంది. సినీ పరిశ్రమను కావాలనే ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా. పవన్ కళ్యాణ్ అభిప్రాయమైతే ఇదే. అయితే ఆయన వ్యాఖ్యలకు అదే స్థాయిలో ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. శనివారం రిపబ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్ల ను ఆన్‌లైన్ లో విక్రయించాలనుకుంటోందని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం జగన్ ఆలోచన అన్నారు.పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తన ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదన్నారు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్. చిత్రపరిశ్రమని ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదన్నారు.ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నారు. చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నామని ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ని తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ప్రభుత్వ తీరును మారుస్తానని, తాను రోడ్డుపైకొస్తే మనిషిని కాదని, బెండు తీస్తామని పవన్ కల్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామన్నారు. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకే మా అడుగులు అంటుండడడం విడ్డూరంగా ఉందన్నారు.మరో మంత్రి పేర్నీ నాని ఘాటుగానే స్పందించారు. తనను పరోక్షంగా సన్నాసి అన్నదానికి అదే స్థాయిలో సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసు.. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? నేను సన్నాసి అయితే పవన్ సన్నాసిన్నర’ అంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా సినిమా టికెట్లు అమ్ముకున్నారు. అప్పుడు ప్రశ్నించలేని పవన్ మా ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు భయం? ట్యాక్స్‌ల విషయంలో కేంద్ర పెద్దలను ప్రశ్నించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. సాయితేజ్ ప్రమాదంపై పోలీసులు చెప్పిందే మీడియా చెప్పింది. తెలంగాణ పోలీసులను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదా? కేసీఆర్‌ను తిట్టే ధైర్యం పవన్‌కు లేదా? వాళ్లను ప్రశ్నించలేడు కాబట్టే.. ఇక్కడ సొల్లు కబుర్లు చెప్తాడు. అని అన్నారు.