Andhra Pradesh
నేడు దీపావళి పర్వదినం….దీపం జ్యోతి పరబ్రహ్మ

నేడు దీపావళి పర్వదినం….దీపం జ్యోతి పరబ్రహ్మ
క్యాపిటల్ వాయిస్, ఆధ్యాత్మిక సమాచారం :- జ్యోతి స్వరూపం భారతీయ సాంప్రదాయ చిహ్నం. దీపం వెలిగించడం అనేది సర్వపాప హారంగా దైవస్వరూపంగా పూజలందించడం అనాదిగా మన భారతీయ కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తోంది. దివ్య దీపావళి పండుగ లో దీపాలు వెలిగించటం ఓ ప్రత్యేకత. దీపం జ్యోతి పరబ్రహ్మ, మన సంప్రదాయం ప్రకారం ధర్మ జ్యోతి, జ్ఞాన జ్యోతి, దైవ జ్యోతి ఇలా ఎన్నో దీపాలను దైవ మందిరంలో వెలిగించి పూజించటం, హారతి గా కర్పూరాన్ని వెలిగించి భగవంతుని కి సమర్పించడం చేస్తుంటాము. వేద మతం. ధర్మం కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. ఒక చిరు దీపం చీకట్లను తరుముతుంది. ఒక చిన్న దీపం వేలాది దీపాలను వెలిగిస్తుంది. జ్ఞాన సుధలు పంచుతోంది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది.దీపం వెలగడం అంటే చైతన్యం వెల్లివిరుస్తుంది గా చెప్తారు. హృదయం ప్రమిదగా, భావనలు వత్తి గా వెలిగించినప్పుడు మనలోని కల్మషాలను కరిగిస్తూ దీపం కాంతి వెలుగుతుంది. హోమముల ద్వారా అగ్నిని ప్రజ్వలించి, యజ్ఞము ద్వారా ప్రకృతిని పలకరించి లోకా సమస్తా సుఖినోభవంతు అన్నది ఋషివాక్యం. అందుకే నరకుడనే చీకటి రాక్షసుని ‘వధ’ లోకాలకు చీకటిని పారద్రోలి వెలుగుని స్తే అది దీపావళి. అమావాస్య చీకటిలో వెలుగునిస్తున్న దీపం హృదయ జ్యోతి. పవిత్ర కార్తీక మాసం నెల రోజుల పాటు రోజూ దీపాలను వెలిగించి సర్వ దేవతా స్వరూపంగా దీపాలను ఆరాధిస్తారు. అందుకే అన్నారు దీపం జ్యోతి పరబ్రహ్మ.