నలుగురు మంత్రుల పై వేటు పడనుందా – మంత్రివర్గ ప్రక్షాళన చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారా !?

నలుగురు మంత్రుల పై వేటు పడనుందా – మంత్రివర్గ ప్రక్షాళన చేసేందుకు జగన్ సిద్దమవుతున్నారా !?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- మరో సంచలన నిర్ణయం దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు నిర్ణయించారు. కొద్ది నెలల క్రితం జరిగిన కేబినెట్ విస్తరణ వేళ.. కొందరిని ఎరి కోరి సీఎం జగన్ మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కానీ, అందులో కొందరు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మంత్రులు అయిన తరువాత ప్రభుత్వం – పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాల్సి న సమయంలో ఏమీ పట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో..ఇప్పటి వరకు వారి తీరు మార్చుకొనేందుకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్..ఇక, తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో నేరుగా మంత్రులకే ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.మరి కొద్ది రోజుల వరకు వేచి చూస్తానని, మార్పు రాకుంటే రిటైర్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే పలు రకాల సర్వేల ద్వారా మంత్రుల పని తీరు పైన సీఎం జగన్ నివేదికలు తెప్పించుకున్నారు. దీంతో..ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రుల నుంచే ముందుగా సరి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ – ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించటంలో నిర్లిప్తంగా ఉండటం.. శాఖల పరంగా పట్టు లేని మంత్రులు నలుగురిని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అందులో ఒకరు మహిళా మంత్రి ఉన్నారు. కోస్తా ప్రాంతానికి చెందిన ఆ మహిళా మంత్రికి కీలక శాఖ అప్పగించినా..తన శాఖ మీద ఆరోపణలు వస్తున్నా తిప్పి కొట్టటంలో విఫలమవుతున్నారు. అదే విధంగా గత కేబినెట్ లో ఉంటూ..ప్రస్తుతం సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న సీమ ప్రాంతానికి చెందిన మంత్రి పని తీరు పైన సానుకూలత కనిపించటం లేదని తెలుస్తోంది.ఆయన్ను తప్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక, గతంలోనే అనేక రకాలుగా వివాదాల్లో చిక్కుకున్నా.. ప్రత్యేక సమకరణాలతో కేబినెట్ లో కొనసాగుతున్న మంత్రి పని తీరు ఏ మాత్రం మెరుగుపడటం లేదని నివేదికలు తేల్చినట్లుగా తెలుస్తోంది. ఆ మంత్రిని తప్పిస్తారని చెబుతున్నారు. ఇక, పార్టీ ఎమ్మెల్యేగా బలంగా వాయిస్ వినిపిస్తారనే నమ్మకంతో గోదావరి జిల్లాల నుంచి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ను పక్కన బెట్టీ.. మరీ అవకాశం ఇచ్చినా..మంత్రి అయిన తరువాత ఆయన పని తీరు సమర్ధవంతంగా లేదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ మంత్రిని పక్కన పెట్టుకొని..మీడియా సమావేశం నిర్వహించటం ద్వారా ప్రభుత్వ ఇమేజ్ కు నష్టం కలుగుతుందనే వాదన కొందరు వినిపిస్తున్నారు.దీంతో.. ఈ నలుగురి గురించి ఎక్కడా పేర్లు ప్రస్తావించకపోయినా.. కేబినెట్ సమావేశంలో మంత్రులు అందరూ ప్రభుత్వం పైన వచ్చే విమర్శల విషయంలో ఖచ్చితంగా స్పందించాల్సిందేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఒక మహిళా మంత్రి తన పని తీరు కంటే.. ప్రచారంలో మాత్రం చక్కగా రాణిస్తున్నారనే అభిప్రాయ పార్టీ ముఖ్య నేతల వద్ద చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నిఘా సంస్థల నుంచి పార్టీ – ప్రభుత్వ వ్యవహారాల్లో మంత్రుల పని తీరు గురించి ఆరా తీస్తున్న సీఎం.. ఎన్నికల వేళ కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో..సామాజిక – ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూనే..అవసరమైన మార్పుల దిశగా సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. దీపావళి తరువాత ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది. దీంతో..మంత్రి పదవి పైన ఆశలు పెట్టకొని ..ఛాన్స్ మిస్ అయిన వారు ఇప్పుడు తిరిగి తమ ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.