ముదురుతున్న పీఆర్సీ ఫైట్.. ఉద్యోగ సంఘాల తలోదారి !

ముదురుతున్న పీఆర్సీ ఫైట్.. ఉద్యోగ సంఘాల తలోదారి !
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అంశంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పీఆర్సీ నివేదికను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగల సంఘాలతో భేటీ అయిన జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ వారికి ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాల మధ్య బేధాభిప్రాయాలు రావడాన్ని ప్రభుత్వం అవకాశంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీ విషయంలో విజ్ఞప్తుల స్వీకరణకు నోడల్ అధికారిని నియమిస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ అదనపు కార్యదర్శి ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించినట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.తమకు బకాయి ఉన్న పీఆర్సీని అమలు చేయాలని కొంతకాలంగా జగన్ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఐతే ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తున్నా అటువైపు నుంచి మాత్రం స్పష్టమైన హామీ రావడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు బుధవారం రాత్రి వరకు సచివాలయంలోనే బైఠాయించినా ప్రభుత్వం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. పీఆర్సీ, ఇతర విజ్ఞప్తులపై చర్చించేందుకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సమావేశం అనంతరం నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపింది. పీఆర్సీ పై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.గురువారం జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ అయ్యారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని.., జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్య సంఘాల వివరాలను తెలపాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరాయి. ఐతే పీఆర్సీ విషయంలో మాత్రం శశిభూషన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. పీఆర్సీపై సీఎంఓతో చర్చలు కొనసాగుతున్నాయని.. వెల్లడించినట్లు సమాచారం. పీఆర్సీ ఇప్పట్లో ఇవ్వలేమని ఏపీ జేఏసీ ఛైర్మన్ డి స్రీనివాసరావు తెలిపారు. ఈ అంశంలో తానేం చేయలనని.. అంతా సీఎం, సీఎస్ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఉద్యోగ సంఘాల తలోదారి..
తమకు కీలకమైన పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలు తలోదారిలో వెళ్తున్నాయి. పీఆర్సీ విషయంలో అమరావతి జేఏసీ, ఏపీ జేఏసీ ప్రభుత్వంపై పోరాడుతంటే మూడో సంఘం మాత్రం వీరితో కలవడం లేదు. ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాస్, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈరోజు జీఏడీ కార్యదర్శితో భేటీ అయి పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేయగా.. సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాత్రం భిన్నంగా స్పందించారు. కొందరు నేతలు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.ఐతే పీఆర్సీ విషయాన్ని నాన్చడమనేది ప్రభుత్వ ఉద్దేశమా..? లేక ఉన్నతాధికారులే ఇలా చేస్తున్నారా..? అని అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పీఆర్సీ నివేదిక ఇచ్చి ఏడాదిన్నర అయిందని.. నివేదికను బయటపెట్టాలని రెండు నెలలుగా కోరుతున్నా ఎందుకు బయటపెట్టలేదని నిలదీస్తున్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు వాయిదా వేస్తూ వస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. ఐతే వారం రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇస్తామని ప్రభుత్వం తెలిపినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు.