మరొకసారి మోసానికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారా? బి అలర్ట్

మరొకసారి మోసానికి మాస్టర్ ప్లాన్ చేస్తున్నారా? బి అలర్ట్
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) నకరికల్లు :- మండల కేంద్రమైన నకరికల్లు లో సుమారు 9, 10 సంవత్సరాల క్రితం అద్దంకి – నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారి విస్తరణలో భాగంగా మండల కేంద్రమైన నకరికల్లులో ఎంతో మంది నివాసం ఉంటున్న ఇల్లు స్థలాలు పోగొట్టుకొని రోడ్డున పడ్డారు.ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసుల అండతో నిర్దాక్షిణ్యంగా గృహ సముదాయాలను జె.సి.బి లతో కూల్చివేసారు. బాధితులకు ప్రభుత్వపరంగా ఇప్పటివరకు కూడా ఒక్క నయాపైసా నష్టపరిహారం అందలేదు. నష్ట పరిహారం అందజేస్తామని కాంట్రాక్టర్ కంటికి కనిపించకుండా పోయాడు. వచ్చిన ప్రతి అధికారి సంప్రదించిన ప్రజా ప్రతినిధులు ఎక్కడికి వెళ్ళిన ఎటువంటి సమాధానం ఇప్పటివరకు చెప్పలేదు. ఎలక్షన్ టైం లో మాత్రం మీకు అండగా ఉంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు తప్ప సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ నిర్వాసితులకు ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఈ రోజు స్వఛ్ఛంద సంస్థ అంటూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని చెప్పి మీటింగ్ ఏర్పాటుచేశారు.తీరా అక్కడకు వెళ్ళిన నిర్వాసితులకు మరోసారి భంగపాటు ఎదురైంది. జీవనోపాధికి అండగా ఉంటామని చెప్పి గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఆంతర్యమేమిటంటే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమానికి పూనుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. త్వరలో ఈ రహదారిని ఆరు లైన్ లు గా మార్చే క్రమంలో ఈ సంస్థ గ్రామంలోకి అడుగు పెట్టిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అప్రమత్తమైన ప్రజలు ఒక్కసారిగా వారి వద్దకు వెళ్లి ఇప్పటికే ఎంతో నష్టపోయాము ఇంకా మా మీద కసి పోలేదా ఇంకెందుకు మా ప్రాణాలు తీసుకోండి మీకు మా గోల ఉండదు,మాకు కూడా ఏ బాధ ఉండదు అని ఆవేదన వెలిబుచ్చడంతో టెంటు లాగేసుకుని వెళ్ళిపోయారు. అయితే గతంలో అప్పటి ఆర్.డి.సి.ఎఇ.గుర్రం సతీష్ నర్సరావుపేట డివిజన్ వరకు రోడ్డు నిర్వాసితులకు 13 కోట్ల 91 లక్ష డిపాజిట్ చేసామని తెలిపారు. నకరికల్లు గ్రామంలో రోడ్డుకిరువైపులా కలపి సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టపరిహారం క్రింద కేటాయించామని, ఎవరికి ఎంత నష్టపరిహారం వస్తుందో అనే వివరాలతో కూడిన పేపర్లను ప్రజలకు పంచారు.ఈ రోడ్డు విస్తరణ వలన నకరికల్లు గ్రామంలో సుమారు 260 కుటుంబాల వారు పూర్తిగాను,పాక్షికంగాను నష్టపోయారు.ఎన్నో కుటుంబాలు దారుణంగా నష్టపోయారు. వారిలో కొంతమంది గ్రామం విడిచి వెళ్ళిపోయారు.