మానవాళికి మరో ముప్పు..శాస్త్రవేత్తల అధ్యయనాల్లో షాకింగ్, జాగ్రత్త పడకపోతే ఇబ్బందే !

మానవాళికి మరో ముప్పు..శాస్త్రవేత్తల అధ్యయనాల్లో షాకింగ్, జాగ్రత్త పడకపోతే ఇబ్బందే !
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా తేరుకుంటున్నాం. ఇంకా పూర్తిగా ముప్పు తప్పకపోయినా, కొద్దిగా తెరిపిన పడే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల్లో టీకా అందరికీ అందిపోతే మరికాస్త కుదుట పడే అవకాశాలుంటాయని అందరం నమ్ముతున్నాం. కానీ, మరోసారి కరోనా లాంటి మహమ్మారి మన మీద దండెత్తుతుందేమో అనే ఊహ ఎప్పుడైనా వచ్చిందా? కరోనా పేరు చెబితేనే వణుకు పుడుతున్న పరిస్థితిలో .. మరో మహమ్మారి అన్న మాట వింటే.. అది రానవసరం లేదు ముందే పై ప్రాణాలు పైనే పోతాయి. మనకు కరోనా నేర్పిన పాఠం అటువంటిది. అయితే, మళ్ళీ కరోనా లాంటి మహమ్మారి కచ్చితంగా మన మీద విరుచుకుపడే అవకాశాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా నూరేళ్ళ కోసారి ప్రపంచం మీద మహమ్మారులు దండయాత్ర చేస్తాయనేది అందరి నమ్మకం. కానీ, ఈ సారి ఈ నమ్మకం వమ్మయిపోతుంది. ఈసారి ఆరు దశాబ్దాల తరువాత కొత్త మహమ్మారి దండయాత్ర చేస్తుందని శాస్త్రవేత్తలు బల్లగుద్ది చెబుతున్నారు.ఇటలీలోని పడువా యూనివర్సిటీ.. అమెరికాలోని ద్యూక్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో అత్యంత అరుదుగా వచ్చే వైరస్ లు వందేళ్లకు ఓసారి కాకుండా అరవై ఏళ్లకు ఓసారి ప్రపంచం మీదకు వస్తాయని తేలిందని చెబుతున్నారు. అంటే 2080 లో మరో ముప్పు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని వారు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అనే జర్నల్ లో ముద్రించిన సమాచారంలో పేర్కొన్నారు.
అధ్యయనం ఏం చెబుతోందంటే..
కోవిడ్ లాంటి మహమ్మారి ఏ అసంవత్సరంలోనైనా రావడానికి 2 శాతం అవకాశాలున్నాయి.
గత 50 ఏళ్లలో రకరకాల కొత్త వైరస్ లు పుట్టుకొచ్చాయి. వచ్చే మరికొన్నీ సంవత్సరాలలో కరోనా వంటి మహమ్మారి వైరస్ లు పుట్టుకొచ్చే అవకాశం మూడురెట్లు ఎక్కువగా ఉంది. ఈలెక్కన చూస్తే కరోనా వంటి వైరస్ మరో 58 ఏళ్లకు వచ్చే ఛాన్స్ ఉంది.1918-1920 మధ్య 3 కోట్లమందికి స్పానిష్ ఫ్లూ బలితీసుకుంది. ఇప్పటివరకూ అంతటి భయంకర వైరస్ అదొక్కటే. అలాంటి వ్యాధి సంభవించే ముప్పు ఏడాదికి 0.3 శాతం నుంచి.. 1.9 శాతం వరకూ పెరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ 400 ఏళ్ల లోపు అటువంటి వ్యాధి విరుచుకుపడే అవకాశాలున్నాయి.మరో 12 వేల ఏళ్లలో మానవ జాతి యావత్తునూ నాశనం చేసే వైరస్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.ఇలాంటి ముప్పులు పెరగడానికి కారణం జనాభా పెరుగుదల.. ఆహార విధానంలో మార్పులు.. పర్యావరణ విధ్వాంశం.. వ్యాధికారక జంతువులతో మనుషులు కలిసి తిరగడం వంటి కారణాలున్నాయి.
ఈ అధ్యయనాన్ని ఎలా చేశారంటే..
ఈ అధ్యయనాన్నీ లీడ్ చేసిన ఇటలీ శాస్త్రవేత్త డాక్టర్ మార్కో మారానీ, అయన బృందం ఈ అధ్యయనాన్ని కొత్త గణాంకాల పద్ధతిలో నిర్వహించారు. 400 ఏళ్ల లో చికిత్స లేని మామారులకు సంబంధించిన గణాంకాలను సేకరించి, వాటి ఆధారంగా భవిషత్ లో వచ్చే ముప్పుపై అధ్యయనము చేశారు. ప్లేగు, స్మాల్ పాక్స్, కలరా, టైఫాస్, స్పానిష్ ఫ్లూ, ఇంఫ్లూయెంజా వంటి వ్యాధులు ఎప్పుడు వచ్చాయి. ఎన్నేళ్లు మనుషులపై దండయాత్ర చేశాయి? ఎంత తరుచుగా ఇటువంటి మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది వంటి వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు.మొత్తం మీద ఈ అధ్యయన ఫలితాలు భవిష్యత్ పై భయాన్ని పెంచేవిగానే ఉన్నాయి. మానవజాతి ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ఇటువంటి వైరస్ లు మరింత ముందుగా వచ్చే అవకాశాలూ కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.