కర్నూలుకు హైకోర్టు – ఆ దిశగా మరో అడుగు ముందుకు !?

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసినట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన సుదీర్ఘ ప్రసంగం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. కోస్తాతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం. దీనికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక తుది రూపాన్ని దిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన బిల్లు ఈ వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ జగన్ సభ చివరి రోజున బిల్లును ప్రవేశపెట్టి- ఆమోదింపజేసుకుంటారని చెబుతున్నారు.ఈ పరిణామాల మధ్య కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు- ఆందోళనలకు దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాను ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్.. తక్షణమే హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలంటూ వారు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే న్యాయవాదులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నాలకు దిగారు.. రోడ్డుపైనా బైఠాయించారు.ఇవ్వాళ కూడా బార్ అసోసియేషన్ సభ్యులు కర్నూలు నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేయాలంటూ నినదించారు. సభ ఆమోదం పొందిన బిల్లును సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేస్తోన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు వివిధ రూపాల్లో తమ నిరసనను ఉధృతం చేస్తామని బార్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి.. మూడు సంవత్సరాల కిందట ప్రకటించారని, అది ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోవట్లేదని అన్నారు. కర్నూలుకు హైకోర్టు సాధన కోసం మరింత ఉధృతంగా ఆందోళనలను నిర్వహించనున్నట్లు చెప్పారు.తమ విధులను కూడా బహిష్కరిస్తామని న్యాయవాదులు తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై విస్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు ఎలాంటి కేసులను విచారించబోమని పేర్కొన్నారు. ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరింత ఇబ్బందులకు గురి చేసినట్టయింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి రోజు బిల్లు సభలో ప్రవేశపెట్టి- ఆమోదం పొందేలా చేయాలని అధికార పార్టీ భావిస్తోంది.