కర్నూలు కార్పొరేషన్ కార్యాలయం లోకి గాడిదలు – కార్పొరేషన్ అధికారులు షాక్ !

కర్నూలు కార్పొరేషన్ కార్యాలయం లోకి గాడిదలు – కార్పొరేషన్ అధికారులు షాక్ !
క్యాపిటల్ వాయిస్, కర్నూలు :- కర్నూలు కార్పొరేషన్ కార్యాలయం లోకి గాడిదలు వచ్చాయి. ఆఫీసులోకి గాడిదలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా…. అసలేం జరిగిందంటే.. ఆఫీసులోకి గాడిదలు వాటంతట అవే రాలేదు. మున్సిపల్ అధికారుల తీరుకి నిరసనగా రజకులు వాటిని తీసుకొచ్చారు.మున్సిపల్ సిబ్బంది గాడిదలను నిర్బంధించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా ఆఫీసులోనికే వాటిని తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందుల పేరుతో గాడిదలను నిర్బంధించడం వల్ల తిండి లేక రెండు గాడిదలు చనిపోయాయని రజకులు వాపోయారు. వాటికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాడిదలను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది ఉందని ఎవరో ఫిర్యాదు ఇచ్చారనే సాకుతో కార్పొరేషన్ అధికారులు కర్నూలు నగరంలో ఉన్న గాడిదలను లారీలోకి ఎక్కించారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటికి నగరం చుట్టూ తిప్పారు. రాత్రి 7 గంటల సమయంలో కర్నూలు పాత బస్టాండ్ ఆవరణలో లారీని ఆపేశారు.ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లాం. అయితే ఉదయం నుంచి మేత, నీళ్లు లేకపోవడంతో గాడిదలు తల్లడిల్లాయి. ఇదేమి న్యాయం అని అడిగితే.. మున్సిపల్ అధికారులు చిందులు తొక్కారు. ఎవడికి చెప్తావో చెప్పుకో అన్నారు. అసలు గాడిదలు సాకమని మీకు ఎవరు చెప్పారు అని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు తమను అసభ్య పదజాలంతో దూషించారు” అని రజకులు వాపోయారు.కాగా, రజకులు గాడిదలతో ఆఫీసులోకి రావడంతో కార్పొరేషన్ అధికారులు షాక్ తిన్నారు. ఏం జరుగుతుందో వారికి కాసేపు అర్థం కాలేదు. గాడిదలు లోనికి వచ్చేయడంతో ఇబ్బంది పడ్డారు. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.