AnanthapurAndhra Pradesh

జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ సిద్ధం…?

జేసీ బ్రదర్స్‌కు చెక్ ! అనంతపురం టీడీపీని చక్కదిద్దేందుకు హైకమాండ్ సిద్ధం…?

క్యాపిటల్ వాయిస్, (అనంతపురం జిల్లా) :- అనంతపురం జిల్లా టీడీపీలో పరిస్థితుల్ని మెరుగుపర్చాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి.. సీనియర్ నేతలపై ఆరోపణలు చేస్తున్న జేసీ బ్రదర్స్‌ను కంట్రోల్‌లో పెట్టాలని నిర్ణయించారు.తెలుగుదేశం పార్టీలో జేసీ బ్రదర్స్‌కు ఉక్కపోత ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలందరిపైనా ఆరోపణలు చేస్తూ తాము ఒక్కరే కార్యకర్తలను పట్టించుకుంటున్నామన్నట్లుగా ప్రకటనలు చేయడంపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. తాడిపత్రిలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లోనూ వారు వేలు పెట్టడమే కాకుండా పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు వంటి వారిపై ఆరోపణలు చేయడంపై టీడీపీ హైకమాండ్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. అనంతపురం టీడీపీలో పరిస్థితుల్ని చక్క బెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ప్రతీ సారి పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. ఇక నుంచి ఇలాంటి వాటిని సహించకూడదని భావిస్తున్నారు. అందుకే ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి .. పార్టీ సీనియర్ నేతలపై ఆరోపణలు చేస్తున్న జేసీ వర్గానికి చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల శింగనమల నియోజకవర్గంలో జేసీకి సన్నిహితులకు కాకుండా ఇతరులకు పార్టీ పదవులు అప్పగించారు. ఇంచార్జిగా ఉన్న బండారు శ్రావణి జేసీ వర్గం. ఆమెకు ప్రాధాన్యత తగ్గించి ఇతరులకు ప్రాధాన్యత కల్పించారు. ఈ అంశంపై అమరావతి వెళ్లి అచ్చెన్నాయుడుని కలిసినప్పటికీ వారికి సానుకూల స్పందన రాలేదు. ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు హెచ్చరికగా ఓ లేఖ విడుదల చేశారు. ఇతరుల నియోజకవర్గాల్లో వేరే ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోకూడదని.. ఎవరైనా అలా జోక్యం చేసుకొంటే.. వారి కార్యక్రమాల్లో ఇతరులు పాల్గొంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని లేఖలో హెచ్చరించారు. ఇప్పటికీ జేసీ బ్రదర్స్ తమ రాజకీయాలను మార్చుకోకపోతే మార్చుకోకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకొనేందుకు పార్టీ అధిష్ఠానం సిద్దం అయ్యినట్లు తెలుస్తోంది. ఈ విషయం అంచనాకు రావడంతో జేసీ బ్రదర్స్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎప్పడూ పార్టీ కమిటీ మీటింగ్లో పాల్గొనని జెసి అస్మిత్ రెడ్డి… శుక్రవారం అనంతపురం పార్టీ కమిటీ సమావేశంలో తాడిపత్రి ఇంచార్జ్ హోదాలో హాజరయ్యారు. అనంతపురం పార్టీ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న పార్టీ అదిష్ఠానం ఎవరైనా…ఎంతవారైనా సరే పార్టీ లైన్ దాటితే సహించేది లేదన్న బలమైన మెసెజ్ పంపింది.ఇ న్నాళ్లు జెసి వర్గంగా చెలామణి అవతున్న పలువురు నేతలు కూడా పరిస్థితులను గమనిస్తున్నారు తప్పితే ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. రాయలసీమలో తెలుగుదేశం పటిష్టంగా వున్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం తగ్గడం లేదు. దీంతో వీరిని మార్చకపోతే పార్టీ నష్టపోతుందని కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో జేసీ బ్రదర్స్‌ని కంట్రోల్ చేయడం ద్వారా పార్టీని చక్కదిద్దే ప్రయత్నాన్ని టీడీపీ హైకమాండ్ ప్రారంభించింది .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!