Andhra PradeshGuntur
తన పేరున ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వేయర్…. లబో దిబోమంటున్న స్థల యజమానులు

తన పేరున ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న సర్వేయర్…. లబో దిబోమంటున్న స్థల యజమానులు
క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి, కారంపూడి ;- కారంపూడి మండలంలో మండల సర్వేయర్ భూరికార్డులలో తప్పులను ఆసరగా చేసుకుని తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. మండలంలో స్థలాలను కొలవాలని సర్వేయర్ దగ్గరికి వెళ్తే, మార్కెట్లో రేటు అధికంగా ఉంటే ఇక వారి సంగతి అంతే సంగతులు. వివాదం లోని భూములు, స్థలాలు సర్వే కోసం సర్వేయర్ వద్దకు వెళితే వారి తిప్పలు ఇక దేవుడికెరుక అన్న రీతిలో తహసిల్దార్ కార్యాలయంలో కనబడుతుంది. స్థలం వివాదంలో ఉండి సర్వే కోసం అర్జీ పెట్టుకుంటే ఇక బేరసారాలు మొదలుపెడతారు. కారంపూడి లోని అత్యధిక విలువ చేసే స్థలం వివాదం లో ఉండి, సంవత్సరాలుగా సర్వే కోసం తిరుగుతున్నా, స్థల యజమానులు కొలత కోసం సర్వేయర్ ను సంప్రదించగా,వీరి కొలత సంగతి ఏమో కానీ ఏకంగా ఎక్కడో ఉన్న సర్వేయర్ బంధువులకు 14 సెంట్లు ఆన్ లైన్ ఎక్కించి, తన పేరున నాలుగు సెంట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గతంలో ఇదే స్థలం ప్రభుత్వ స్థలమని ప్రచారం కాగా, మండల తహసీల్దార్ మరియు సర్వేయర్ బృందం రెండు రోజులపాటు సర్వే నిర్వహించి ఎటువంటి ప్రభుత్వ భూమి లేదని,ఈ స్థలం ప్రస్తుత యజమానులదేనని అప్పట్లో తేల్చారు. కొన్ని రోజుల తర్వాత ఏకంగా అదే స్థలాన్ని మండల సర్వేయర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థల యజమానులు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, మండల సర్వేయర్ మోసాలు ఒకొక్కటి బయట పడుతున్నాయి.విచిత్రం ఏమిటంటే ఇదే స్థలాన్ని మరలా కొలవగా గతంలో కొలిచి నపుడు ఎలా వుందో ఇప్పుడు కూడ అలాగే వుందని అధికారులు తెలిపారు. మరి అక్కడ స్థలం లేకుండ మండల సర్వేయర్ నాలుగు సెంట్లు ఏ వుద్దేశం తో రిజిష్టర్ చేయించుకున్నాడో అధికారుల కెరుక ? వినుకొండ రోడ్డు లోని ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో, ఆ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్ను పడటంతో వ్యాపారులకు ఆ పొలాలను కట్టబెట్టి వారి వద్దనున్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇలా ఏకంగా సుమారు 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా సర్వేయర్ మాత్రం తనకేమీ కాదన్నట్టు, తనకు అన్ని రకాల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు బహిరంగంగానే పలువురితో చెప్పుకుంటున్నాడని మండల ప్రజలు వాపోతున్నారు.ప్రభుత్వ భూముల ఆక్రమణలు పట్టించుకోని అధికారులు…
దీనిపై స్పందించాల్సిన తహసీల్దార్ మరియు జిల్లా సర్వే అధికారులు అన్నీ తెలిసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూమి సర్వే చేయటం ఇతనికి కలిసొచ్చిన అంశం. భూ సర్వేలో సర్వేయర్ల కొరత ఉండటం ఇతనికి కలిసొచ్చిన అంశంగా తెలుస్తోంది. ఇక తనకు ఏమీ కాదని, తనని ఎవరూ ఏమీ చేయలేరని ధీమాగా మండల సర్వేయర్ ఉన్నాడు. ఇంత జరుగుతున్నా ఏకంగా సర్వేయర్ మోసాలు బహిరంగంగా బయటపడుతున్నా అతనిపై ఏవిధమైన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అవినీతి అధికారుల పై చర్యలు తీసుకోకపోతే ఈలాంటి అవినీతి అధికారులు మరింత అవినీతికి పాల్పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా అవినీతి అధికారుల పై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.