Telangana
రాజ్యాధికారానికి రాని జాతులు నశించిపోతాయి : బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్

రాజ్యాధికారానికి రాని జాతులు నశించిపోతాయి : బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్
క్యాపిటల్ వాయిస్, (తెలంగాణ) కరీంనగర్ : రాజ్యాధికారానికి రాని జాతులు నశించిపోతాయని, అంబేద్కరిజం యొక్క అంతిమ లక్ష్యమైన బహుజన రాజ్యాధికారం సాధించినప్పుడే పీడిత కులాల విముక్తి సాధ్యమవుతుందని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బిఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపల్లి గణేష్ పిలుపునిచ్చారు. బహుజన నాయకత్వాన్ని పటిష్టపరిచేందుకు బహుజన సేన ఆధ్వర్యంలో “బహుజనోద్యమం – పీడిత కులాల విముక్తి” అను అంశంపై ఈ నెల 25వ తారీకు హైదరాబాదులోని బోడుప్పల్ లో గల ఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించ తలపెట్టిన క్యాడర్ క్యాంపు విజయవంతానికై ప్రచురించిన కరపత్రాలను అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, న్యాయ తదితర రంగాలలో మనువాదం రాజ్యమేలుతోందన్నారు. అమరవీరుల త్యాగాల పునాదుల పై ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దొరల చేతుల్లో బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 93 శాతంగా ఉన్న మెజారిటీ ప్రజలైన బహుజనులు అణచివేత, వివక్షత, అఘాయిత్యాలకు గురవుతున్నారు. రెండు సార్లు తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, సొంత వారికి పదవులను కట్టబెట్టి కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వాలు అమలు పరచిన పథకాలను సైతం నిలిపివేసి, స్వయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పథకాలను సైతం కొనసాగించకుండా, కొత్త పథకాలు ప్రకటిస్తూ, అమలుకాని హామీలనిచ్చి ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నాడన్నారు. మెజారిటీ ప్రజలైన బహుజనులు అతి తక్కువ జనాభా గల దొరలకు ఓటు బ్యాంకుగా మారి, వారి పాలనలో బానిసలుగా మిగిలిపోతున్నారన్నారు. తెలంగాణలో రాజకీయాలు చిన్నాభిన్నమై, రాజకీయ అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో బహుజన రాజ్యాధికార సాధన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. బహుజన పితామహుడైన మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్, కాన్షీరామ్ ల ఆలోచనా విధానంలో బహుజన, ప్రజా సంఘాలను ఒకే తాటి మీదికి తీసుకువచ్చి, నూతన రాజకీయ పోకడలను సంతరించుకుని,రాజ్యాధికార సాధన దిశగా పయనించే విధంగా బహుజనోద్యమాన్ని నిర్మించాలన్నారు. ఈనెల 25 వ తారీఖున జరిగే క్యాడర్ క్యాంప్ లో బహుజన, ప్రజా, విద్యార్థి,ఉద్యమ సంస్థల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు.కె.యాదవ్, భీమ్ ఆర్మీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోయినిపల్లి చంద్రయ్య, బహుజన సేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆడెపు త్యాగరాజు, వీరపాగ సురేందర్, బహుజన నాయకులు మిట్టపల్లి రాజేశం, బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కల్లెపల్లి మనోజ్ కుమార్, బోయిని కృష్ణబాబు, ఊట్ల బాపిరెడ్డి, పుల్యాల రామిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.