జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద యానాదుల బైఠాయింపు…. నిరసన

జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద యానాదుల బైఠాయింపు…. నిరసన
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ గిరిజనుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ మణికుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐటిడిఎ గవర్నింగ్ బాడీ సమావేశం జరుగుతుండడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లోనికి వెళ్లేందుకు యానాదుల సంక్షేమ సంఘం నేతలు ప్రయత్నించగా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. ఐటీడీఏ పీవో వ్యవహారశైలిని వినతిపత్రం సమర్పించేందుకు తమని లోనికి అనుమతించాలని సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య పోలీసులను కోరారు. అయితే పోలీసులు మాత్రం శాంతిభద్రతల దృష్ట్యా లోనికి పంపించలేమని గేట్ల వద్ద నిలిపివేశారు. నేతలు, కార్యకర్తలు దాదాపు రెండు గంటలపాటు జెడ్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించారు. ప్రతినిధి బృందం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ భాషా వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు శేఖర్, మురళీ, చెంబేటి ఉష, కొటేశ్వరమ్మ, విజయమ్మ పాల్గొన్నారు.