Andhra Pradeshkrishna
ఫ్లైయాష్ కాదు బంగారం అంటున్న అక్రమార్కులు….ఫ్లైయాష్ పేరుకే ఉచితం… కావాలంటే ప్రియం…!?

ఫ్లైయాష్ కాదు బంగారం అంటున్న అక్రమార్కులు….ఫ్లైయాష్ పేరుకే ఉచితం… కావాలంటే ప్రియం…!?
క్యాపిటల్ వాయిస్, (కృష్ణా జిల్లా) ఇబ్రహీంపట్నం : – ఉచితం మాటున అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోందని ఫ్లైయాష్ దొంగలు నిరూపించారు. అక్రమ దందాను అడ్డుకునే వారు లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని ప్రజలు భావిస్తున్నారు.జాతీయ రహదారి పక్కనే లారీలకు లోడింగ్ చేసి జేబులు నింపుకుంటున్నారని, ఎన్టీటీపీఎస్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతో ఇష్టారాజ్యంగా తయారైంది. “మీ అక్రమ వ్యాపారం మీరు చేసుకోండి. మా బూడిద చెరువు ఖాళీ అయితే చాలు” అన్నట్లు ఉంది ఎన్టీటీపీఎస్ అధికారుల తీరు ఉందని సామాన్యులు విమర్శిస్తున్నారు. దీంతో సామాన్యుడికి ఒక్క ట్రాక్టర్ లేక లారీ ఫ్లైయాష్ కావాలంటే ఉచితంగా అందకపోగా వేల రూపాయలు అక్రమార్కులకు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.చర్యలు తీసుకోవల్సిన ఎన్టీటీపీఎస్, జెన్ కో అధికారులు చోద్యం చూస్తున్నారని సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అక్రమార్కులు తమ వ్యాపారాన్ని దర్జాగా చేస్తున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాం నుంచి నేటి వైసీపీ ప్రభుత్వ హయాం వరకు ఈ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఫ్లైయాష్ కాసులు కురిపిస్తుండటంతో అక్రమార్కులు దందాను వదులుకోలేకపోతున్నారు. ఫ్లైయాష్ అవసరమైన సామాన్యులకేమో చుక్కలు కనబడుతున్నాయి. ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పాటు ఫ్లైయాష్ బూడిద కాలుష్యాన్ని భరిస్తున్న మండల ప్రజానీకానికి రోగాలు బహుమానంగా మిగులుతుండగా…. బూడిద వ్యాపారం చేసే అక్రమార్కులు రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులోని సుమారు వంద ఎకరాల్లో ఉన్న ఎన్టీటీపీఎస్ యాష్ పాండ్ ఫ్లైయాష్ బూడిదతో నిండిపోయింది. ఈ పాండ్ ను ఖాళీ చేసేందుకు ఫ్లైయాష్ ఉచితంగా తీసుకెళ్లేందుకు ఎన్టీటీపీఎస్ యాజమాన్యం అనుమతులిచ్చింది. ఎన్టీటీపీఎస్ లో ఏడు యూనిట్ల నుంచి రోజుకు ఎనిమిది వేల టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతోంది. 210 మెగావాట్ల యూనిట్ నుంచి వెయ్యి టన్నుల చొప్పున ఆరు యూనిట్లకు ఆరు వేల టన్నులు, నాల్గవ దశలోని 500 మెగావాట్లు (ఏడో యూనిట్) నుంచి 2000 టన్నులు ఉత్పత్తి అవుతోంది. సైలోల నుంచి విడుదలవుతున్న నాలుగు వేల టన్నుల ఫ్లైయాష్ ను ట్యాంకర్లలోకి ఎగుమతి చేస్తుండగా, మరో నాలుగు వేల టన్నుల ఫ్లైయాష్ ను యాష్ పాండ్ కు పంపుతున్నారు. ఇలా నిత్యం నాలుగు వేల టన్నుల ఫ్లైయాష్ పాండ్ కు చేరి నిండిపోయింది. ఈ పాండ్ ను ఖాళీ చేసే క్రమంలో భాగంగా నిత్యం వందల లారీలకు ఫ్లైయాష్ ఎగుమతులు జరుగుతున్నాయి. ఒక లారీ ఫ్లైయాష్ ఎగుమతికి రూ.500 వసూలు చేస్తున్నట్టు సమాచారం. అదే లారీ ఫ్లైయాష్ రూ.5000 పలుకుతోంది. ఇక్కడ ప్రారంభమైన దందా బయట కూడా కొనసాగుతోంది. సిమెంట్ ఫ్యాక్టరీలు, బ్రిక్స్ ఇండస్ట్రీస్, లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీలు ఉచితంగా సరఫరా చేసుకునే అవకాశం ఉంది. ఈ ఫ్లైయాష్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో క్యాష్ చేసుకుంటున్నారని ప్రజారోపణ.
ఇలా జరుగుతోంది……
సిమెంట్ ఫ్యాక్టరీలు, బ్రిక్స్ ఇండస్ట్రీస్ పేర్లు చెప్పి ఫ్లైయాష్ ను లారీల్లో తరలిస్తున్నారు. యాష్ పాండ్ లో రూ.500 చెల్లించి యాష్ లోడుతో వస్తున్న లారీలు మండల పరిధిలోని పలు ఖాళీ స్థలాల్లో డంప్ చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన జూపూడి, మూలపాడు పరిసర ప్రాంతాల్లో ని పలు క్రషర్లు, ఖాళీ స్థలాలు డంప్ చేసిన ఫ్లైయాష్ కొండలను తలపిస్తోంది. యాష్ పాండ్ నుంచి బయటకు వచ్చిన ఫ్లైయాష్ ను డంప్ చేసేందుకు అనుమతి లేదు. సిమెంట్ ఫ్యాక్టరీలు, బ్రిక్స్ ఇండస్ట్రీస్ వారు కూడా కొద్దిపాటి నిల్వలు మాత్రమే ఉంచాలి. కానీ ఇక్కడ వందల లారీల ఫ్లైయాష్ గుట్టలు కనిపిస్తున్నాయి. క్రషర్ల లో సైతం పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. ఈ గుట్టల మాటున అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. అక్రమార్కులు ఇక్కడ నిల్వ చేసిన ఫ్లైయాష్ ను లారీ రూ.5000 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దూరప్రాంతాలకు అయితే రూ.10 వేల పై మాటేనని పలువురు చెబుతున్నారు. లారీల్లో ఎగుమతుల కోసం జేసీబీలను కూడా వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన దందా ప్రస్తుత ప్రభుత్వంలోనూ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ మధ్య ఫ్లైయాష్ కోసం దాడుల జరుగుతున్నాయి అంటే ఎంత రాబడి ఉందొ అర్థం చేసుకోవచ్చని ప్రజలు చెప్పుకుంటున్నారు, అక్కడ రూ.500 చెల్లించి తెచ్చుకుంటున్న ఫ్లైయాష్ ను డంప్ చేసుకొని రూ.5000 కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
విజిలెన్స్ ఏం చేస్తున్నట్టో……!
ఫ్లైయాష్ పాండ్ లో జరుగుతున్న అక్రమాలు, బయట నిల్వ చేసి సాగిస్తున్న అక్రమ వ్యాపారంపై ఎన్టీటీపీఎస్ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అక్రమాల గురించి తెలిసినా చర్యలు చేపట్టకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమార్కుల నుంచి కొంతమంది ఎన్టీటీపీఎస్ అధికారులకు ముడుపులు ముట్టడంతో చర్యలకు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.