గుబులు పుట్టిస్తున్న అసంకల్పిత భేటీలు – డోలాయమానంలో ఏపీ రాజకీయ పార్టీలు !?

గుబులు పుట్టిస్తున్న అసంకల్పిత భేటీలు – డోలాయమానంలో ఏపీ రాజకీయ పార్టీలు !?
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కీలక దశ నడుస్తోంది. సాఫీగా నడుస్తున్న రాజకీయం భేటీ లతో కుదుపులకు లోనైంది. ‘ఈనాడు’ అధిపతి రామోజీరావు, కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అవడం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. అభినందన విందు అని చెబుతున్నప్పటికీ దానివెనక కచ్చితంగా రాజకీయ ఉద్దేశం ఉన్నట్లు అందరికీ స్పష్టమవుతున్న విషయమే. వీరితో అమిత్ షా భేటీ ఖాయమనే సమాచారం బయటకు వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ప్రధానమంత్రితో జగన్ అరగంట భేటీ అయ్యారు. ఏ విషయమనేది బయటకు రాలేదు.ఏపీలో అంతర్గతంగా పొత్తులకు సంబంధించిన రాజకీయాలు నడుస్తున్నాయనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోను ఓడిస్తానని, వైసీపీ ముక్త ఏపీ అనేది తమ నినాదమంటూ జనసేనాని పవన్ ప్రకటించారు. ఓట్లు చీలనివ్వనంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేయాలి. వేరే అవకాశం కూడా లేదు. అదే సమయంలో భారతీయ జనతాపార్టీ కూడా టీడీపీకి దగ్గరవుతోంది. దీనికి బలం చేకూర్చేలా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఒక ట్వీట్ చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడమనేది వారిష్టమని పోస్ట్ చేశారు.మూడు సంవత్సరాల నుంచి హాట్ హాట్ గానే సాగుతున్న టీడీపీ, వైసీపీ రాజకీయాలపై తాజాగా జరిగిన ‘భేటీ’లు ఒక్కసారిగా నీళ్లు గుమ్మరించినట్లైంది. అధికార పార్టీ ప్రతిపక్షాన్ని వేటాడం.. కేసులు.. విచారణలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాజకీయం అనూహ్య మలుపు తీసుకుంది. చంద్రబాబు బీజేపీ పెద్దలతో సమావేశమవుతున్నారు. బాబు విషయంలో ఘాటుగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు రివర్స్ లో అధికార పార్టీపై వ్యాఖ్యలు చేస్తోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.ఈరకంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కీలకమైన దశ నడుస్తోందని భావించవచ్చు. ఒకవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందంటూ వార్తలు.. వాటిని బలపరిచేలా విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం లాంటివన్నీ కలిపి సరికొత్త రాజకీయ పరిణామాలకు ఏపీ వేదిక కాబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. ఏపీ బీజేపీ నేతలు గతంలోలా చంద్రబాబుపై తీవ్రంగా స్పందించడంలేదు.ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోవైపు విజయవాడలో యువ సంఘర్షణ ర్యాలీకి హాజరైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతోందనే అనుమానం విశ్లేషకుల్లో తలెత్తుతోంది. అదేమిటనేది తేలాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పేలా లేదు.