గోదావరి కి పోటెత్తిన వరద……… ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి కి పోటెత్తిన వరద……… ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- విపరీతంగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. గోదావరి నదికి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజీకి 13.19లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నది నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14 అడుగులకు చేరుకుంది.దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి మళ్లీ వరద ప్రమాదం పొంచి ఉండటంతో, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగే అవకాశముందని, అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక అధికార యంత్రాంగాన్ని సైతం ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి.తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ప్రాణహిత, ఇంద్రావతిలోకి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు, గోదావరి పరీవాహక ప్రాంతాలు మరోమారు వరద బారిన పడుతున్నాయి. గోదావరి నదికి గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి జూలై నెలలోనే వరద రావడంతో అనేక గోదావరి పరీవాహక గ్రామాలు, లంక గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముంపుకు గురైన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడలేదు. ఈ సమయంలో మరో మారు గోదావరి నదికి వరదలు పోటెత్తటం , మళ్ళీ ముంపు గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లో అనేక మండలాలు వరదల బారిన పడినందున సహాయక చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు స్పందన దళం, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన మూడు బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ వరదల పెరుగుదల దృష్ట్యా ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. తాము స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ నుండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని , అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత నెలలో గోదావరి వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం నుండి అధికారుల బృందం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తోందని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే మరోవైపు కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయిలో నిండి 3.96 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పర్యవసానంగా, దిగువన నాగార్జున సాగర్ డ్యాం కూడా క్రమంగా నిండుతోంది మరియు పూర్తి రిజర్వాయర్ స్థాయికి చేరుకుంటుంది. నాగార్జున సాగర్ దిగువన ఉన్న డాక్టర్ కె ఎల్ రావు పులిచింతల జలాశయానికి దాదాపు 50,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దాదాపు లక్ష క్యూసెక్కుల వరద నీటిని బంగాళాఖాతంలోకి వదిలేందుకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్లు అన్నీ తెరిచారు.