గ్యాస్ సిలిండర్ పేలుడు…….. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు !

గ్యాస్ సిలిండర్ పేలుడు…….. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు !
క్యాపిటల్ వాయిస్, చిత్తూరు :- చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం లింగాపురం లో రాజగోపాల్ అనే వ్యక్తి ఇంట్లో ఎల్పీజీ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ లీకవడం తో రాజగోపాల్ తన కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. వారంతా ఆరుబయటకి పరుగెత్తుకొచ్చారు. కాసేపటికే సిలిండర్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది.అప్పుడప్పుడే చీకటి పడుతోంది. ఇంట్లో లైట్లు ఆన్ చేశారు. ఇంటి యజమానికి ఎక్కడో తేడా కొట్టింది. గ్యాస్ వాసన వస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులందరినీ అప్రమత్తం చేశారు. వాళ్లంతా మూకుమ్మడిగా ఆరుబయటికి పరుగు అందుకున్నారు. క్షణాల్లో పెద్ద పేలుడు. ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామానంతా చెల్లాచెదురైంది. కుటుంబ పెద్ద అప్రమత్తతతో కుటుంబసభ్యులు మాత్రం తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం లింగాపురం లో శనివారం (నవంబర్ 5) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజగోపాల్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది.మంటలు విస్తరించకుండా స్థానికులు జాగ్రత్తపడ్డారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పొరుగు ఇళ్లకు వ్యాపించలేదు. గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీకైందా? లేదా వెలిగించిన స్టవ్ ఆరిపోతే, ఇంట్లో వాళ్లు చూసుకోలేదా తెలియాల్సి ఉంది. గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. గ్యాస్ లీకవుతున్న విషయాన్ని గుర్తించి, రాజగోపాల్ తన కుటుంబ సభ్యులను తీసుకొని ఇంటి బయటకు వచ్చేశారు. కాసేపటికే పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. మంటలు భారీగా ఎగసి పడ్డాయి.ఆ కుటుంబానికి భూమ్మీద ఇంకొన్ని రోజులు మిగిలున్నాయి కాబట్టే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా బతికి బయటపడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రమాదంలో రాజగోపాల్ కుటుంబం మాత్రం భారీగానే నష్టపోయింది. గ్యాస్ సిలిండర్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తుచేస్తోంది.