గాజువాక తహశీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావు కు 6 నెలల జైలు శిక్ష !

గాజువాక తహశీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావు కు 6 నెలల జైలు శిక్ష!
అప్పీలు కోసం పరుగులు….తూంగలంలో గోడ కూల్చిన సంఘటనలో
క్యాపిటల్ వాయిస్, విశాఖ జిల్లా ప్రతినిది :- గాజువాక తహసీల్దార్‌కు 6నెలల జైలుశిక్షతో పాటు రూ. 2వేల జరిమాన విధిస్తూ ఉన్నత న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. ఈనెల 18వ తేదీన స్వయంగా కోర్టుకు హాజరుకావాలని, హాజరైన అనంతరం ఆయన్ను సివిల్ ప్రిజన్ (నిందితుల జైలు)కు తరలించాలని రిజిస్ట్రార్ జుడీషియల్‌ను ఆదేశించింది. కోర్టు విధించిన జరిమాన చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం తూంగలం గ్రామ పంచాయతీ పరిధిలోని 29/1 సర్వే నెంబర్‌లో ఉన్న భూమి నుంచి తమను అధికారులు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు 2014లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఆ భూమి నుంచి వారిని ఖాళీ చేయించరాదని అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ అధికారులు స దరు సర్వే నెంబర్ లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో పిటిషనర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు, తహసీల్దార్ ఎంవీఎస్ లోకేశ్వరరావును ప్రతివాదులుగా చేరుస్తూ ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి తుది తీర్పు వెలువరించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టినందునే వాటిని కూల్చివేశామని తహసీల్దార్ కౌంటర్ దాఖలు చేశారు. ఇతర అధికారులు సమర్పించిన కౌంటర్లను కూడా పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి తుది నిర్ణయం తీసుకున్నారు. తహసీల్దార్ చర్యలు ఉద్దేశపూర్వక ఉత్తర్వుల ఉల్లంఘన కిందకే వస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే వారి నుంచి చట్టబద్ధంగా స్వాధీన పరచుకోవాల్సి ఉందని అయితే అలాంటిదేమీ లేకుండా యంత్రాలతో నిర్మాణాలను కూల్చివేయటం తగదని స్పష్టం చేసింది.