దుర్గమ్మ అమ్మవారి మండపంలో ఒకవంక మంత్రాలు – మరోవంక తన ధ్యాస…. క్రికెట్ తో తంటాలు !

దుర్గమ్మ అమ్మవారి మండపంలో ఒకవంక మంత్రాలు – మరోవంక తన ధ్యాస…. క్రికెట్ తో తంటాలు !
క్యాపిటల్ వాయిస్, విజయవాడ :- హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు దండయాత్ర కొనసాగుతోంది. కొద్దిరోజుల వ్యవధిలో రెండు టీ20 సిరీస్‌లను చేజిక్కించుకుంది. టీ20లపై తనదైన ముద్ర వేసింది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాపై జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా. అది ముగిసీ ముగియగానే ఇప్పుడు దక్షిణాఫ్రికాను మట్టి కరిపించింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. 2-0 తేడాతో దీన్ని గెలుచుకుంది రోహిత్ సేన. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టీ20 రేపు మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో షెడ్యూల్ అయింది. అస్సాంలోని గువాహటి స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 237 పరుగులు చేసింది. అసాధారణమైన ఇన్నింగ్ ఆడారు టీమిండియా బ్యాటర్లు. ఓపెనర్లు కేఎల్ రాహుల్-57, రోహిత్ శర్మ-43 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. మిగిలిన బ్యాటర్లు దాన్ని కొనసాగించారు. విరాట్ కోహ్లీ-49, సూర్యకుమార్ యాదవ్-61 పరుగులు చేశారు. చివర్లో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా పోరాట పటిమను కనపరిచింది. చివరి వరకూ పోరాడింది. జట్టు స్కోరు ఒక్క పరుగు వద్ద ఉన్నప్పుడే ఇద్దరు కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరినప్పటికీ.. ఏ మాత్రం మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. కెప్టెన్ టెంబా బావుమా, టాప్ ఆర్డర్ బ్యాటర్ రిలీ రొస్సో డకౌట్ అయినప్పటికీ పట్టు వదల్లేదు. ఎయిడెన్ మార్క్‌రమ్- 33 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. క్వింటన్ డికాక్- 69, మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో కదం తొక్కారు. విజయం కోసం ఈ రెండు జట్లు కూడా హోరాహోరీగా పోరాడటంతో ప్రేక్షకులు తీవ్ర ఉత్కంఠతకు గురయ్యారు. సీట్ ఎడ్జ్ ఫీలింగ్‌ను చవి చూశారు. దీనికి నిదర్శనం- ఈ వీడియో. దుర్గమ్మ అమ్మవారి మండపంలో ఒకవంక మంత్రాలు చదువుతూనే- మరోవంక తన ధ్యాస మొత్తాన్నీ మ్యాచ్ మీదే పెట్టాడో అర్చకుడు. తన మొబైల్‌లో మ్యాచ్‌పై నుంచి చూపు తిప్పలేదు. కనురెప్ప వాల్చలేదు. మైక్‌లో మంత్రాలు చదువుతూ, అమ్మోరికి పూజలు చేస్తూ- మొబైల్‌లో మ్యాచ్ చూస్తూ కనిపించాడు.