డెంగ్యూ, మలేరియా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు

డెంగ్యూ, మలేరియా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి :- ఒకపక్క కరోనా విలయం, మరోపక్క సీజనల్ వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుపోతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం వర్షాకాలం దృష్ట్యా డెంగ్యూ, మలేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏజెన్సీ, స్లమ్ ఏరియాల కంటే నగరంలోనే డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని, ప్రజలు స్థానిక మున్సిపల్ అధికారులకు సహకరించి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచే విషయంలో వారి యొక్క సలహాలు పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కాస్త ఉపశమనం పొందాలని అన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఆ విపత్తు నుండి బయటపడకుండానే ప్రస్తుతం వర్షాకాలం కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి ప్రజల జీవితాలను నాశనం చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని అన్నారు. అందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండి జ్వరం, జలుబు, ఒంటినొప్పులు ఏమైనా లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు.అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా మున్సిపల్ శానిటరీ సిబ్బంది పారిశుధ్యం విషయంలో గాని, ప్రజలకు పారిశుద్యంపై అవగాహన కల్పించడంలో గాని ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు. భీమిలి మున్సిపాలిటీగా ఉండేటప్పుడు కంటే జివిఎంసిలో విలీనమై జోనల్ కార్యాలయంగా ఉండేటప్పుడు భీమిలి జోన్ విస్తీర్ణం పెరిగిందని, కానీ శానిటరీ సిబ్బంది గతంలో ఎంతమంది ఉన్నారో ప్రస్తుతం వారే ఉండటం వలన మొత్తం ఏరియాని కవర్ చేయడంలో కొంచెం ఇబ్బందులు ఉన్న కారణంగా జివిఎంసి కమీషనర్ గారు భీమిలి జోన్ కి అదనపు శానిటరీ సిబ్బందిని నియమించాలని గంటా నూకరాజు కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ చురకల రమణ, నాయకులు కొక్కిరి అప్పన్న, రాజగిరి రమణ, అరసివిల్లి అనిల్ కుమార్, దౌలపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.