దసరా సంబరాల్లో దారుణం… భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి

దసరా సంబరాల్లో దారుణం… భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
క్యాపిటల్ వాయిస్, జాతీయం :- నవ రాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులు.. విగ్రహ నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో దారుణం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దారుణ ఘటన చత్తీస్‌గఢ్‌లోని జాస్పూర్ జిల్లా పాతల్‌గావ్‌లో జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయని జాస్పూర్ ఎస్పీ విజయ్ అగర్వాల్ వెల్లడించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం స్థానికులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో పాతల్గావ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనంపైకి దూసుకెళ్లిన కారు డ్రైవర్‌ను పట్టుకుని చితక్కొట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులు బబ్లూ విశ్వకర్మ (21), శిశుపాల్ సాహు (26) ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిది మధ్యప్రదేశ్ అని, చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాగా.. స్థానికులు పెద్ద ఎత్తున పాతల్‌గావ్ పోలీస్ స్టేషన్ వద్దకు ఆందోళనకు దిగారు. జనంపై నుంచి దూసుకెళ్లిన కారులో పెద్ద ఎత్తున గంజాయి ఉందని.. వారిని అప్పగించాలంటూ ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ఇది చాలా విషాద ఘటన అంటూ సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేశామని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ట్వీట్ చేసి వెల్లడించారు. నిందితులెవరినీ వదిలిపెట్టమని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.