సీఎం జగన్ పాలనలో ‘సంపన్న మిత్రుల క్లబ్’గా మారిన టీటీడీ బోర్డు…?
+ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఆలయంలో బడానేతల పాగా

సీఎం జగన్ పాలనలో ‘సంపన్న మిత్రుల క్లబ్’గా మారిన టీటీడీ బోర్డు…?
+ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ఆలయంలో బడానేతల పాగా
+ టీటీడీ మీద పట్టు కోసం రాజకీయ పార్టీల పాకులాట
+ సామాన్య భక్తుల దర్శనం పై కనిపించని కనికరం
క్యాపిటల్ వాయిస్,అమరావతి :- తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) వివాదాలు రాష్ట్రాన్ని కుదిపేయడం, వేంకటేశ్వర స్వామి భక్తులను నొప్పించడం కొత్త కాదు. లడ్డూల విక్రయాలలోనో, టీటీడీ సరకుల కొనుగోళ్లలోనో, పూజ, దర్శనాల టికెట్ల బ్లాక్ మార్కెట్ అమ్మాకాల విషయంలోనో వివాదాలు వినబడుతూనే ఉంటాయి. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయినప్పటినుంచి ఈ వివాదాలు జోరు పెరిగింది. మొదట టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచారు. ఆపైన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని చైర్మన్ ను చేశారు. తర్వాత రెండోసారి కూడా నియమించారు. కేంద్ర సర్వీసుల నుంచి తీసుకొచ్చిన ఏవీ ధర్మారెడ్డి అనే అధికారికి పెద్ద పీట వేశారు. ఆపై ఏడు కొండల వాడికి భక్తుల కానుగా సమర్పించిన ఆస్తులను అమ్మేయాలనుకున్నారు. బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్దీ తగ్గింది కాబట్టి, బ్యాంకుల నుంచి టీటీడీ డబ్బు తీసేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సెక్యూరిటీలలో పెట్టాలనుకున్నారు. తర్వాత, ప్రయోగాత్మకంగా అంటూ తిరుమలలో లాభపేక్ష లేకుండా సంప్రదాయ భోజనం వ్యాపార క్యాంటీన్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇలా ఒకటి కాదు…ఎపుడూ ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది, ఒకదాని తర్వాత మరొకటి. ఇపుడు తాజాగా రాష్ట్రాన్ని కుదిపేసిన వివాదం: 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను టీటీడీ బోర్డులో కూర్చోబెట్టడం.తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అంటే బాగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లు, వ్యాపారవేత్తల బోర్డుగా మారిందన్న విమర్శ ఉంది. ఇందులో సభ్యులైనా, ఇపుడు కొత్త గా వచ్చిన ప్రత్యేకాహ్వానితులైనా, ఒక్క క్షణం శ్రీవారి దర్శనానికి క్యూకాంప్లెక్స్‌లలో అయిదారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల దాకా ఓపిగ్గా వేచి చూసే సాధారణ భక్తులకు ప్రతినిధులు కారు. అంతా ఏదో ఒక ‘కనెక్షన్’ తో వచ్చిన వాళ్లే. ఉదాహరణకు బెంగుళూరు యలహంక ఎమ్మెల్యే సింగనాయకనహళ్లి రామయ్య విశ్వనాథ్‌ను తీసుకోండి. ఆయన బోర్డులోకి ఎలా వచ్చారు? యలహంక అంటేనే తెలుగు వాళ్లందరికి అక్కడ ముఖ్యమంత్రి జగన్ నిర్మించుకున్న రాజప్రాసాదంలాంటి ఇల్లు గుర్తుకొస్తుంది. కాబట్టి తన ‘ఊరి’ ఎమ్మెల్యేని బోర్డులోకి తీసుకువచ్చారనే విమర్శవుంది. ఈ ప్రత్యేకాహ్వానితుల అందరికి వెనక ఏదో బీరకాయ పీచు కనెక్షన్ ఉందని తెలుగు మీడియా కథలు కథలుగా రాసింది. మరికొందరు టీటీడీ రెడ్ల అడ్డాగా మారిందని కూడా విమర్శిస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇపుడు టీటీడీ నాలుగు స్తంభాలను ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డిలు ఈ నాలుగు స్తంభాలు. చాలా నిర్ణయాలు వివాదం కావడంతో టీటీడీ వాటిని ఉపసహరించుకుంది. 52 మంది ప్రత్యేకాహ్వానితుల నియామకానికి సంబంధించిన జీవోను హైకోర్టు నిలిపి వేసింది. వివాదాస్పద నిర్ణయాలు విమర్శలొస్తాయని తెలిసినా, దేశంలోని అగ్రశ్రేణి ఆలయమైన తిరుమల గుడిని వివాదంలోకి లాగితే తీవ్ర ప్రతిఘటన వస్తుందని తెలిసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకిలాంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంది? ఈ ప్రశ్న ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. రైటిస్టులు ఇందులో క్రైస్తవ అజెండాను చూస్తున్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి, ఆయన టీటీడీని బలహీనపర్చి, తన క్రైస్తవ అజెండాను అమలుచేసేందుకు ఇలా చేస్తున్నారని వారు చెబుతున్నారు. అయితే, లెఫ్టిస్టులు దీన్ని కొట్టేస్తున్నారు. జగన్ తెలివిగా తన రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం టీటీడీని తన ‘సంపన్న మిత్రుల, బంధువుల క్లబ్’ గా మారుస్తున్నారని అంటున్నారు కొందరు. టీటీడీ రాజకీయ నాయకుల, వ్యాపారస్తుల అడ్డాగా దిగజారిపోతున్నది అనేది రైటిస్టుల, లెఫ్టిస్టుల మధ్య ఉన్న ఏకాభిప్రాయం. 52 మందిని ప్రత్యేకాహ్వానితులనేది హాస్యాస్పదం. జగన్ ప్రభుత్వం తీసుకున్నఇతర నిర్ణయాలు తప్పేమీ కాదు. అయితే వాటిని సమర్థించుకుని అమలు చేయలేకపోతున్నారు” అని తిరుపతికి చెందిన యాక్టివిస్టు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి బీబీసీతో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరొక వాదన వినిపించారు. ఆయన జగన్ ప్రభుత్వ చర్యల్లో ఏదో రహస్య అజెండా ఉందేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐ.వై.ఆర్. గతంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా కూడా పని చేశారు. ”తానేమి చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి జగన్ ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. బోర్డులో రాజకీయాలు ఎపుడూ ఉన్నవే. అసలు బోర్డుకు స్వయం ప్రతిపత్తి ఎక్కడుంది? అది ప్రభుత్వంలో భాగమే. ఎటొచ్చి దీని వెనక ఏదైనా రహస్య అజెండా ఉందా అనే విషయం ఆలోచించాలి” అని ఆయన బీబీసీతో అన్నారు. ”గత ముఖ్యమంత్రులు కూడా రాజకీయ నాయకులను ఛైర్మన్లుగా నియమించారు. వాళ్లకి ఈ ముఖ్యమంత్రికి తేడా ‘విశ్వాసం’. వాళ్లలో భక్తి భావం ఉండేది. ఇప్పుడది కొరవడింది” అని ఐవైఆర్ అన్నారు. టీటీడీ రాజకీయాయకుల, వ్యాపారస్తుల అడ్డాగా దిగజారిపోవడం ఎపుడు మొదలైంది అని అడిగినప్పుడు గతంలో ఎగ్జిక్యూటివ్ అధికారిగా పని చేసిన మరొక మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ”టీటీడీ పతనం నిరంతర ప్రక్రియ. ఎపుడు మొదలైందో చెప్పడం చాలా కష్టం. కాకపోతే, దాని విశ్వరూపం ఇపుడు కనిపిస్తూ ఉంది” అన్నారాయన.
క్రైస్తవ అజెండాను లెఫ్ట్ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు : ఇది ప్రజల మధ్య ద్వేషం రగిలించే దురుద్దేశంతో చేసే ఆరోపణ. టీటీడీ గొప్ప ప్రజా సంక్షేమ సంస్థగా పనిచేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు నడిపింది. ఇపుడు ఈ సంస్థలకు నిధులివ్వడం లేదు. బోర్డు బాగా డబ్బున్నోళ్ల సేవకు అంకితమవూ ఉంది. సంపన్నుల్లో తిరుమల దేవుడి మీద ఉన్న క్రేజ్ ఉపయోగించుకుని రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను వృద్ధి చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది” అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి అన్నారు. ఆయన టీటీడీ ఉద్యోగ సంఘాలతో దశాబ్దాలుగా పని చేస్తూ వస్తున్నారు. ”యలహంక ఎమ్మెల్యేకు బోర్డులో సభ్యత్వం ఇచ్చేందుకు అర్హత ఏమిటి? అక్కడ జగన్ ఆస్తులున్నాయి, వాటికి రాజకీయ అండ కావాలి. ఇలా సభ్యులను నియమిస్తున్నారు. ఇది చాలాదన్నట్లు ఇపుడు ” ప్రత్యేక ఆహ్వానితులు’ అనే డోర్లు తెరిచారు” అని మురళి ఆరోపించారు. టీటీడీలో సమర్ధత కంటే కులానికే ప్రాధాన్యతనిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని తిరుపతి నాయకుడొకరు అన్నారు. ”బోర్డులో ఉన్న ముగ్గురు రెడ్లు సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి ఎవరికి వారే పెద్దవారు. వాళ్ల మధ్య సయోధ్య లేకపోవడం వల్లే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి” అన్నారాయన.
టీడీపీ హయాం నుంచే రాజకీయ నేతల అడ్డాగా మారిన టీటీడీ : రాజకీయ నేతలను టీటీడీ బోర్డు చీఫ్ గా నియమించడం కొత్తకాదు. 1951లో టీటీడీ యాక్ట్ ప్రకారం ఏర్పాటయిన తొలి బోర్డుకు ఛైర్మన్ వెంకటస్వామి నాయుడు ఎమ్మెల్సీ. అయితే, అదెపుడూ వివాదాస్పదం కాలేదు. 1951-1983 మధ్య దాదాపు 16 మంది ఛైర్మన్‌లైతే అందులో వల్లియప్పన్, సి.అన్నారావు, ఎన్.రమేశన్, శ్రావణ్ కుమార్, ఎల్.సుబ్బయ్య, కె.మురళీధర్ లు ఐ.ఎ.ఎస్. అధికారులు. ఈ పరిస్థితి 1983 దాకా కొనసాగింది. తర్వాత సీన్ మారింది.
ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అత్తిలి ఎమ్మెల్యే వీకేడీవీఎస్ రాజును ఛైర్మన్‌గా నియమించడంతో కొత్త రాజకీయ యుగం మొదలయింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేనాటికి రాష్ట్ర సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. టీటీడీని హిందూ ధర్మ సంస్థగా కాకుండా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చైర్మన్, సభ్యుల నియమాకాలు జరిపి రాజకీయ సంస్థగా మార్చి అదుపులోకి తీసుకోవడం మొదలయింది. అనుకూలమైన రూలింగ్ పార్టీ నాయకుడినే టీటీడీ ఛైర్మన్‌గా నియమించడం టీడీపీ నేత కళా వెంకటరావు నియామకంతో మొదలైందని చెప్పవచ్చు.1983- 2021 మధ్య 23సార్లు ఛైర్మన్‌లను నియమిస్తే ఇందులో ఒక ముగ్గురు ఐఎఎస్ అధికారులు, ఒక ఆడిటర్ మినహా అంతా అధికార పార్టీ నేతలే.
టీటీడీ మీద పట్టు కోసం రాజకీయ పార్టీలు : నాడు కాంగ్రెస్, టీడీపీ, ఇపుడు వైసీపీ ప్రభుత్వాలన్ని టీటీడీ మీద పట్టు కోసం పనికొచ్చే తమవారినే ఛైర్మన్‌గా నియమించుకుంటూ వస్తున్నాయి. ఇందులో విశేషమేమి లేకపోయినా, ఈ పోస్టును ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు, ఎన్నికల్లో ఓడిపోయిన వారి పునరావాసానికి, ఆర్థికంగా పార్టీని ఆదుకున్న వారికి కానుకగా సమర్పిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు 1983కు ముందు లేవనే చెప్పాలి. ఇటీవల ముఖ్యమంత్రులు తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే బోర్డు ఛైర్మన్, సభ్యలను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ నియమించిన 52 మంది ప్రత్యేకాహ్వానితులు దీనికి పరాకాష్ట.
బోర్డు పరిమాణం ఎలా పెరుగుతూ వచ్చింది? : 1983 తెలుగు రాజకీయాల్లో మార్పులొచ్చాయి. తెలుగుదేశం పార్టీ రావడంతో రాజకీయ వ్యవస్థ విస్తరించింది. దానికితోడు పారిశ్రామికీకరణ మొదలైంది. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించడం మొదలయింది. పార్టీలకు ఎన్నికల ఖర్చు బాగా పెరిగింది. ఇదే కాలంలోనే టీటీడీ విస్తరణ కూడా బాగా పెరిగింది. భక్తుల సంఖ్య, రాబడి బాగా పెరిగాయి. బోర్డు పదవుల మీద క్రేజ్ మొదలైంది. ఇది అధికార పార్టీలకు బాగా పనికొచ్చింది. తమ ప్రయోజనాలకు పనికొచ్చేవారిని బోర్డు సభ్యులుగా చేసేందుకు బోర్డు సైజును పెంచుతూ పోయారు. సభ్యుల సంఖ్య 82మందికి చేరుకోవడం ఇందులో భాగమే. 1933 నాటి మద్రాసు చట్టంతో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలన హథీరాంజీ మహంతుల నుంచి ఒక కమిటీకి మారింది. అపుడు ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. పదవీ కాలం మూడేళ్లు. ఇందులో ఒకరు అధ్యక్షుడు. ఈ వ్యవస్థ 1951 లో ‘మద్రాసు హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ చట్టం’ వచ్చేదాకా సాగింది. ఈ కాలంలో మొత్తం ఆరుగురు అధ్యక్షులు వచ్చారు. ఇందులో ఒకరు మహంత్. మిగతావారు, వెంకటరంగరాయన్, టి.రామలింగం చెట్టియార్, రఘునాథరెడ్డి, జి.నారాయణ స్వామి చెట్టి, వెంకటస్వామి నాయుడులు పేరున్న నేతలే అయినా, వాళ్ల నియామకం ఎపుడూ వివాదం కాలేదు. 1951 చట్టంతో కమిటీ స్థానంలో ధర్మకర్తల మండలి వచ్చింది. ఇందులో కేవలం అయిదుగురే సభ్యులు. తర్వాత ఆంధప్రదేశ్ ఏర్పడటంతో కొత్త చట్టం అవసరం వచ్చింది. 1966లో కొత్త టీటీడీ చట్టం వచ్చింది. బోర్డు సభ్యుల సంఖ్య 11కు పెరిగింది.
అయితే, ఇందులో శాసనసభ్యులు ముగ్గురు మాత్రమే ఉండాలని, ఒక ఎస్.సి, మరొకరు మహిళ ఉండాలనే నియమం అమలులోకి వచ్చింది. 1979లో వచ్చిన టీటీడీ చట్టం బోర్డును ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులకు కుదించింది. ఈ చిన్న కమిటీ 1983 తర్వాత పెరిగి పెరిగి పెద్దవుతూ 2015 నాటికి 19మందికి, 2021 నాటికి 82 కు చేరింది. ఇదెంత ఎంత వివాదం సృష్టించిందో చూశాం.
ఈస్టిండియా కంపెనీ కాలంలో ఆలయ పాలన! : ఇపుడొస్తున్న వివాదాలను చూస్తే, ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వ కాలంలో ఆలయం ఎలా ఉండిందనే పోలిక అవసరమవుతుంది. ఎందుకంటే, మొదటిసారి ఆలయం ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చింది అపుడే. తిరుమల, తిరుపతి ఆలయాలను కొన్ని నియమాల ప్రకారం నడిపేందుకు ప్రయత్నించి బాగు చేయాలనుకున్నది ఈస్టిండియా కంపెనీయేనని చరిత్ర పరిశోధకురాలు, ‘ హిస్టరీ ఆఫ్ హిందూ రిలిజియస్ ఎండోమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ పుస్తకం రచయిత్రి డాక్టర్ కౌతు నిర్మల కుమారి చెబుతున్నారు. 1801లో ఆర్కాట్ నవాబు నుంచి నెల్లూరు, సౌత్, నార్త్ ఆర్కాటు జిల్లాలు కంపెనీ పాలనకిందికి వచ్చాయి. అలా తిరుపతి కంపెనీ వశమయింది. వీళ్లు ఆలయం నుంచి నిధులు రాబట్టకునేందుకే అయినా, మొదటి చేసిన మంచి పని ఆలయ పాలన కోసం ఒక నియమావళి రూపొందించడం. అదే బ్రూస్ కోడ్. ఆలయ భూముల ఎక్కడున్నాయి, ఎవరిచేతిలో ఉన్నాయి సర్వే చేయించి పునరుద్ధరించారు. ఆలయాలకు ప్రభుత్వం కొంత వార్షిక సాయం అందిస్తూ వచ్చింది. ఆలయ సొమ్ము కాజేస్తున్నవాళ్లను ఏరిపారేశారు. తిరుమలలో మొదటి స్కాం బయటపెట్టి నేరస్తులను శిక్షించారు. ఆదాయం పెంచేందుకు అత్యుత్సాహం చూపి లోపల జరిగే సంప్రదాయాలకు ఎట్టి పరిస్థితుల్లో ఆటకం కలిగించవద్దని కంపెనీ ప్రభుత్వం అప్పటి నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ ను ఆదేశించింది. తిరుమల వంటి ఆలయాల నుంచి అదనపు రాబడి రాబట్టుకున్నా, 1817లో ‘రెగ్యులేషన్ 8’ తీసుకువచ్చి దాని ప్రకారం సంప్రదాయ బద్దంగా తిరుపతితో పాటు మద్రాస్ ప్రెసిడెన్సీ ఆలయ పాలన సంయమనంతో సాగేలా కంపెనీ చర్యలు తీసుకుందని డాక్టర్ నిర్మల కుమారి ఈ పుస్తకంలో రాశారు. 1843లో దాకా ఈ విధానం సాగింది. ఆ ఏడాది, తిరుపతి ఆలయ పాలనా వ్యవహారాలకు అధికారులు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో బోర్డు పరిపాలన హతిరామ్ జీ మఠానికి అప్పగించారు. ”ఈస్టిండియా కంపెనీ కాలంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయంలో అక్రమాలు తగ్గాయి, ఆలయ నిధుల దుర్వినియోగం అవుతాయనే ప్రమాదం తక్కువయింది. ఆలయాల పర్యవేక్షణ వల్ల సర్వత్రా హర్షం వ్యక్త మయింది. ఈస్టిండియా కంపెనీ ప్రజల మనసు దోచుకునేందుకు తీసుకున్న మంచి చర్యల్లో ఇదొకటి” అని నిర్మల కుమారి రాశారు. క్రమంగా ఆలయ పాలన మఠానికి అప్పగించినా పరిపాలన తీరు మీద ఆరోపణలు రావడంతో 1933లో మళ్లీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈ లెక్కన ఈస్టిండియా కంపెనీ రోజుల్లో ఆలయ పాలన మెరుగ్గా సాగిందేమో అనిపిస్తుంది. తిరుమల ప్రాసిస్థ్యాన్ని, భక్తుల మనోభావాలను గౌరవించుకుంటూ … గోవిందుడు అందరివాడు
… అని వెలుగెత్తి చాటాలని పాలకులను ప్రజలు కోరుతున్నారు.