Andhra PradeshSrikakulam
చీమే కదా అనుకున్నారు…. వణుకు పుట్టిస్తున్నాయ్ – ఇసుకలపేట లో చీమల దండయాత్ర !

చీమే కదా అనుకున్నారు…. వణుకు పుట్టిస్తున్నాయ్ – ఇసుకలపేట లో చీమల దండయాత్ర !
క్యాపిటల్ వాయిస్, శ్రీకాకుళం :- సాధారణంగా చీమలను చూస్తే అంతా లైట్ తీసుకుంటాం.. ఎందుకంటే ప్రతి ఇంట్లో సాధారణంగా అవి కనిపిస్తాయి. కానీ ఈ చామలు మాత్రం చాలా డేంజర్.. అక్కడ ఉన్నవారందరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.మొక్కే కదా అని పీకేస్తే.. పీక కొస్తా అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు.. ఇక్కడ చీమే కదా అని నిలిపివేయడానికి లేదు.. వాటి పేరు వింటేనే అసలు గ్రామస్తులు భయపడుతున్నారు. అది కూడా మామూలు భయం కాదు.. ఆ పేరు విన్నా.. వాటిని చూసినా చెమటలు పడుతున్నాయి. అసలు కంటిమీద కునుకే లేదంటున్నారు. చెట్టూ పుట్టా తేడా లేదు.. ఆ ఊర్లో ఎటు చూసినా చీమలే చీమలు. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఎరుపు రంగులో ఉండే ఈ చీమలు మనుషులను కుట్టవు అంటున్నారు. కానీ శరీరం పైకి ఎగబాకడం కూడా ఏమంత తెలియదు .. కానీ ఇవి ఒంటి పైకి ఎక్కాక నోటితో ఏదో రసాయనాన్ని విడుస్తాయి అంటున్నారు. దీంతో శరీరం అంతా చర్మ సంబంధ వ్యాధి వచ్చినట్లు అవుతోందని వాపోతున్నారు.శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లోని రెండు ఊళ్లలో తమ ప్రతాపం చూపిస్తున్నాయి. పగలూ రాత్రనే తేడా లేదు. అదీ ఇది అని లేదు. తినడానికి ఉన్న ప్రతి వస్తువు పైనా దాడి చేసి ఆరగిస్తున్నాయి. అలాగే మనుషుల పై కూడా పాకి ఓ కొత్తరకం అలర్జీని కలిగిస్తున్నాయి.చీమల దండయాత్రతో ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చీమల దండే కనిపిస్తోంది. సాధారణంగా చీమలు కరుస్తాయి. కాసేపు మండినట్లు అనిపించి తగ్గిపోతుంది. కానీ ఇక్కడి చీమలు శరీరంపై పాకినప్పుడు లార్వా లాంటి ద్రవాన్ని స్రవిస్తున్నాయి. దీని వల్లే ఓ కొత్త రకం వల్ల అలర్జీ వస్తోంది. దద్దుర్లు, కురుపులు ఏర్పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. శరీరంపై పాకి వెళ్లిన పది నిమిషాల్లో దద్దుర్లు వంటి సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ చీమలంటేనే భయపడుతున్నారు.కాళ్లు, చేతులపై ఎక్కడ పాకినా అక్కడ అలర్జీ వస్తోంది. పది నిమిషాల్లో దురద వచ్చి చిన్నపాటి పొక్కులు వస్తున్నాయి. చీమల నోటి నుంచి వచ్చే లార్వా, గుర్తు తెలియనిరసాయనం విడిచిపెట్టడం వల్లే ఈ సమస్య వస్తోందని పలువురు చెబుతున్నారు. అలర్జీతో పాటు చిన్నపాటి జ్వరం వచ్చి శరీరం అంతా నొప్పులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. బాధితులు సమీపంలోని ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద చికిత్స పొందుతున్నారు. గాయాలు నయం కావడానికి 10 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు.ఎర్రటి రంగులోని ఈ వేలాది చీమలు ఇళ్లలోకి రాకుండా చూసుకుంటున్నారు. అక్కడి గ్రామస్తులు సొంతంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇళ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార పదార్థాలకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. పురుగు మందులు పిచికారీ చేయడం, చీమల మందును చల్లడం వంటి చర్యలు చేపడుతున్నారు. అయితే వాటితో ప్రయోజనం అంతగా లేదంటున్నారు. అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.