National

అవినీతి కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కి చుక్కెదురు – హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు

అవినీతి కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కి  చుక్కెదురు – హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు

క్యాపిటల్ వాయిస్, జాతీయం :- అవినీతి కేసులో మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి చుక్కెదురైంది. రహదారుల శాఖ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తనపై అవినీతి నిరోధక శాఖ తదుపరి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ వేసిన పిటిషన్‭ను ధర్మాసనం తోసిపుచ్చింది. అంతే కాకుండా అవసరమైతే అవినీతి నిరోధక శాఖ తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని స్పష్టం చేసింది.రహదారుల శాఖ టెండర్లలో రూ.4,800 కోట్ల వరకు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పళనిస్వామిపై కేసు నమోదుచేయాలని కోరుతూ డీఎంకేకు చెందిన ఆర్‌ఎస్‌ భారతి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ పళనిస్వామి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ విచారణ ఉత్తర్వులు రద్దు చేసి, కేసు మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలో టెండర్‌ అవినీతి కేసులో బదులు పిటిషన్‌ వేసే వరకు ఏసీబీ తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించాలని కోరుతూ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా అవినీతి కేసులో ప్రాథమిక విచారణ నివేదిక ఏసీబీ కమిషనర్‌ వద్ద ఉందని ఏసీబీ తరఫున హాజరైన న్యాయవాది పేర్కొన్నారు. ఈ స్థాయిలో కేసు నిలుపుదల చేయడం సబబు కాదన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం.. ఈపీఎస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!