భారీ అంచనాలతో భయపడొద్దు.. ఆటలో 100 శాతం ఇస్తే విజయం మీదే : అథ్లెట్లతో ప్రధాని మోడీ

భారీ అంచనాలతో భయపడొద్దు.. ఆటలో 100 శాతం ఇస్తే విజయం మీదే : అథ్లెట్లతో ప్రధాని మోడీ
క్యాపిటల్ వాయిస్, జాతీయం :-టోక్యో ఒలింపిక్స్ మరో పది రోజుల్లో మొదలు కానున్నాయి. ఈమేరకు అన్ని దేశాల ఆటగాళ్లు ఇప్పటికే టోక్యో బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. మనదేశం నుంచి దాదాపు 120 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో ఆడేందుకు అర్హత సంపాదించారు. మొదటి విడతగా కొంతమంది అథ్లెట్లు జులై 17న టోక్యో వెళ్లనున్నారు. ఈమేరకు ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు నేడు (మంగళవారం) భారత ప్రధాని అథ్లెట్లతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా ఈ మీటింగ్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అథ్లెట్లందరినీ ప్రోత్సహిస్తూ, పలు విధాలుగా ధైర్యం చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అందరితో మాట్లాడిన పీఎం మోడీ.. మీపై ఉన్న అంచనాలకు భయపడొద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని కోరారు.మేరీ కోమ్, సానియా మీర్జా, దీపికా కుమారి, నీరజ్ చోప్రాలతోపాటు ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుత ఒలింపిక్స్ కొంచెం కొత్తగా అనిపించవచ్చు. అలాగే అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, ఆటపై మనసు లగ్నం చేసి, 100 శాతం ప్రయత్నించి, విజయం సాధించాలని పీఎం కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ నంబర్ వన్ గా తిరిగి రావాలని ప్రధాని ఈ సందర్భంగా కోరారు. అలాగే ప్రవీణ్ జాదవ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాలను ప్రశంసించారు. ‘ఎన్నో అంచనాలు మీపై ఉంటాయి. కానీ, వాటిని చూసి భయపడకూడదు. ఆటలో 100 శాతం ఇస్తే.. తప్పక విజయం సాధిస్తారని’ పీఎం మోడీ సూచించారు.