AGRICULTUREAndhra Pradesh
అతను ఓ మట్టి మనిషి….70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చిన వైనం !

అతను ఓ మట్టి మనిషి….70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చిన వైనం !
+ జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం
+ పుట్టిన విత్తనం మొలకెత్తి నేడు వటవృక్షం అయింది
క్యాపిటల్ వాయిస్, ప్రత్యేక సమాచారం :- ప్రకృతి మానవుడికి అందించిన అడవులను విచక్షణారహితంగా నరుకుతూ ఒకవైపు జీవవైవిధ్యానికి, మరోవైపు పర్యావరణానికి గండి కొడుతూ కాసులకు కక్కుర్తి పడుతున్న మనుషులు ఉన్న ఈ నేల మీద ఓ మట్టి మనిషి తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నాడు. ఇదేదో సినీ దర్శకుడు చిత్రించిన సినిమా కథ కాదు, నిజ జీవితంలో ఓ మహోన్నత వ్యక్తి చేస్తున్న కృషికి నిలువుటద్దం. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో దుశ్చర్ల సత్యనారాయణ అనే రైతు మనసులో అడవి ని పెంచాలని పుట్టిన విత్తనం మొలకెత్తి నేడు వటవృక్షంగా మారింది. తొలుత 16 ఎకరాలు జొన్న పంట, సద్ద పంట వేసిన ఆ రైతు పశుపక్ష్యాదులు పంట తినకుండా కాపలా ఏర్పాటు చేశారు. కానీ ఒకరోజు పక్షులు వచ్చి ఆ పంట గింజలను తింటుంటే అతని మనసు మారిపోయింది. పక్షులకు పొట్ట నింపాలి అనుకున్నాడు. ఆ క్షణం నుండి ఆ పంట మొత్తం పక్షుల కు వదిలేశాడు. అప్పటి నుండి తన ఆశయానికి తన కృషిని జోడించాడు. వ్యవసాయ భూమిలో పంటలను వదిలేసి చెట్లను నాటడం మొదలు పెట్టాడు. కాల చక్రం తిరుగుతున్న నేపథ్యంలోనే వేలాది చెట్లు పెరిగాయి. ఒకటి కాదు రెండు కాదు 70 ఎకరాల్లో పలు రకాల చెట్ల అడవి పెరిగింది. నీడనిచ్చే చెట్లతో పాటు జంతువులు పక్షులు తినేందుకు పలు రకాల పండ్ల చెట్లు సైతం అడవిలో నాటాడు. ఆ అడవిలో కాసే పండ్లు కాయలు ఫలాలు తాను కానీ తన కుటుంబం గాని, ఒక్కటంటే ఒక్కటి కూడా ముట్టుకోరు. ప్రతి కాయ జంతువులు, పక్షులు తినాల్సిందే.ఈ నిస్వార్థ ఆశయం దుశ్చర్ల కే సాధ్యం. అడవిలో ఈ ఏడాది 150 బస్తాల చింతపండు కాసింది. కానీ పిడికెడు చింత కాయలు కూడా చేతిలో పట్టుకోలేదని.. అన్ని కోతులు, ఇతర జంతువులు వచ్చి తిన్నాయని, ఇంతకన్నా తనకు ఏమి కావాలని ఆనందం వ్యక్తం చేసారు. ఇంకా అడవిలో సీతాఫలం, చెట్లు, జామ తోట ఉందని వేసవిలో జామ తోటలో పక్షుల కిలకిలలు చూడముచ్చటగా ఉంటుందని అన్నారు. జామ పండ్లను తింటూ అక్కడే నివాసాలు ఏర్పరచుకుని ఉంటాయన్నారు.అడవిలో పశువులకు, పక్షులకు, జంతువులకు దాహం అయితే నీరు తాగేందుకు ఏడు చెరువులను తవ్వించాడు. చెరువులో తాబేలు, చేపలు తదితర వంటివి సాదుతూ జీవవైవిధ్యానికి జీవన్ పోస్తున్నాడు. అడవిలో విరిగిపడిన కొమ్మలు చెట్లు సైతం భూమిలో కలిసిపోవాల్సిందేనని, మట్టిలో ఉన్న సూక్ష్మ జీవులు సహితం ఈ చెట్ల కాడలను తిని బతకాలని మహోన్నతమైన లక్ష్యంగా ముందుకు వెళుతున్నాడు దుశ్చర్ల సత్యనారాయణ.మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు గా మారిన ఈ రోజుల్లో మనిషి మనిషిని మోసం చేస్తున్నా నేటి సమాజంలో ఒక మనిషి స్వార్ధాన్ని వీడి జంతు జీవ జలాలపై, పశు పక్షాదుల పై మమకారం పెంచుకుని వాటిని బతికేస్తూ సమాజానికే ఆదర్శం వ్యక్తిగా నిలుస్తున్నాడు. ఇటువంటి అరుదైన వ్యక్తి కలియుగంలో ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇంత గొప్ప ఆలోచన బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో. ఏది ఏమైనా సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామం దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా దుశ్చర్ల సత్యనారాయణ ఆదర్శ కార్యాచరణతో కొనియాడ పడటం ఎంతో గర్వకారణం. సత్యనారాయణ ఆశయం, ఆదర్శం ఆచరణలకు, మనమంతా చేతులెత్తి అభినందించాల్సిందే.