ఆర్థికంగా నష్టపోయిన న్యాయవాదుల్ని ఆదుకోండి : చలసాని అజయ్ కుమార్

ఆర్థికంగా నష్టపోయిన న్యాయవాదుల్ని ఆదుకోండి : చలసాని అజయ్ కుమార్
క్యాపిటల్ వాయిస్, కృష్ణ్ణా జిల్లా ప్రతినిధి :- కరోనా లాక్ డౌన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది న్యాయవాదులు జీవనోపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర బార్ కౌన్సిల్, వివిధ బ్యాంకులు తక్షణమే మూడు లక్షల రూపాయలు రుణాన్ని మంజూరు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ ( ఐ ఎ ఎల్) రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ కుమార్ నేడు ఒక ప్రకటనలో కోరారు. కరోనా వల్ల అనేక మంది న్యాయవాదులు మృతి చెందగా అనేక మంది న్యాయవాది కుటుంబాల్లో ఎవరో ఒకరు కోవిడ్ బారిన పడటం అలాగే న్యాయ స్థానాలు ప్రత్యక్షంగా లేకపోవడం వల్ల వారి కుటుంబాల్లో జీవనభృతి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం క్రింద ప్రతినెల సహాయం రాకపోవటం, ఎప్పుడో ఐదారు నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని లా నేస్తం కు దరఖాస్తు చేయాల్సిన న్యాయవాదుల సంఖ్య ఎక్కువగానే ఉందని వారికి కూడా వెంటనే అందే విధంగా చేసే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న లా నేస్తం నిధులను వెంటనే మంజూరు చేసి జూనియర్ న్యాయవాదుల ఆదుకోవాల్సిందిగా కోరారు.