ఏపీలోకి 18న రానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర….. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా – దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్

ఏపీలోకి 18న రానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర….. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా – దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్
క్యాపిటల్ వాయిస్, కర్నూలు :- కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 18న ఏపీ లోకి ప్రవేశించనుంది. ఈ మేరకు పాదయాత్ర ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లు చర్చించారు.మంగళవారం కర్నూల్ జిల్లాలో కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఈ నెల 18న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పాదయాత్ర పూర్తయిందని, ప్రస్తుతం కర్ణాటకలో పాదయాత్ర కొనసాగుతుందని పూర్తిచేసుకొని యాత్ర ఏపీలోకి ప్రవేశిస్తోందని అన్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజుల పాటు 95 కి.మీ మేర ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలో 13 రోజుల పాటు యాత్ర జరుగుతుందని జైరాం రమేష్ వివరించారు. అనంతరం మరో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు విశేష స్పందన వస్తుందని తెలిపారు. దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని దిగ్విజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.విభజించు, పాలించు అనే నినాదంతో బీజేపీ పాలన సాగుతోందన్నారు. 2024లో అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ ఉమెన్ చాందీ, తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.