ఏపీలో ముందస్తు ఎన్నికలు – సీఎం జగన్ కు తప్పదని ప్రతిపక్షనేతల వ్యాఖ్యలు !

ఏపీలో ముందస్తు ఎన్నికలు – సీఎం జగన్ కు తప్పదని ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు !
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అంటూ ఇప్పుడు మరోసారి ఈ చర్చ తెర పైకి వచ్చింది. కొంత కాలం క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు -జనసేనాని కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికలకు సంబంధించి ముందస్తుగానే కసరత్తు ప్రారంభించారు. గతం కంటే భిన్నంగా ఎమ్మెల్యేలంతా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేసారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు. అదే సమయంలో ఎన్నికలే టార్గెట్ టీడీపీ బలమైన నియోకవర్గాల పైన ఫోకస్ చేశారు. సీఎం జగన్ ఎన్నికల దిశగా ఇప్పటికే ఐప్యాక్ టీంలను రంగంలోకి దింపారు. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ ఇంచార్జ్ లతో ఐప్యాక్ టీం సభ్యులను అనుసంధానం చేస్తున్నారు. ఇటు చంద్రబాబు పూర్తిగా తన రూటు మార్చేసారు. సాధారణంగా ఎన్నికల నామినేషన్లు చివరి రోజు వరకు అభ్యర్ధుల విషయం చంద్రబాబు తేల్చేవారు కాదు. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించారు. దాదాపు 108 నియోజవకర్గాల ఇంఛార్జ్ లతో సమీక్షలు పూర్తి చేశారు. అటు పార్టీ నేత లోకేష్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. జనసేనాని పవన్ విజయవాడ కేంద్రంగా నియోజకవర్గాల సమీక్షకు సిద్దమయ్యారు. ఈ సమయంలో ఆకస్మికంగా మరోసారి ముందస్తు ఎన్నికల అంశం పైన చర్చ మొదలైంది. మాజీ సీఎస్ కీలక విశ్లేషణ ప్రభుత్వంలో అనేక హోదాల్లో పని చేసి.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పని చేసి పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు కీలక విశ్లేషణ చేసారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నేతగా ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం మూడు రాజధానుల చుట్టూ తిరుగతున్న రాజకీయం గురించి ఆయన ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ముదిరి ఉచితాల పంపకం కష్ట సాధ్యమవుతున్నది. ఈ సమస్య నుంచి తప్పించుకొని ముందస్తు ఎన్నికల నిర్వహణ ప్రణాళికలో భాగంగా మూడు రాజధానుల అజెండా ముందుకు తెచ్చినట్లు కనిపిస్తున్నది అంటూ కృష్ణారావు ట్వీట్ చేశారు. గతంలో టీడీపీకి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమం ప్రధాన ప్రచారాస్త్రంగా వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమా అదే సమయంలో చంద్రబాబు అండ్ కో ఈ పథకాలు అందనీయకుండా అనేక ప్రయత్నాలు చేస్తోందని సభలో, సమావేశాల్లో సీఎంతో సహా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం లోనూ సంక్షేమ పథకాలు రాష్ట్రం లోని 87 శాతం మందికి అందుతున్నాయని..ప్రతి ఇంటికి వారికి అందుతున్న పథకాల లెక్కలతో లబ్ది దారుల వద్దకు వెళ్తున్నారు. అయితే, ప్రస్తుతం ఆర్దికంగా రాష్ట్రంలో సంక్షోభం ముదురుతోందనేది మాజీ సీఎస్ వాదన. దీని కారణం గానే మూడు రాజధానుల వ్యవహారం ముందుకు తీసుకొచ్చారనేది ఆయన అంచనాగా కనిపిస్తోంది. అటు అమరావతి మహా పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు వ్యూహాత్మకంగా విశాఖ కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ ముందస్తు ఎన్నికల్లో భాగమా..లేక, టీడీపీని ఇరుకున పెట్టే కార్యాచరణా అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.