అంతుచిక్కని వ్యాధితో 30 మంది కాకినాడ కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల అస్వస్థత !

అంతుచిక్కని వ్యాధితో 30 మంది కాకినాడ కేంద్రీయ విద్యాలయం విద్యార్థుల అస్వస్థత !
క్యాపిటల్ వాయిస్, కాకినాడ :- కాకినాడ రూరల్ లోని వలసపాడు కేంద్రీయ విద్యాలయం లోని విద్యార్థులు అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురైయ్యారు. విద్యాలయంలో 5,6 తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్ధులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం కాకినాడ జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని సమాచారం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గల కారణాలను చెప్పలేకపోతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలు తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను వైద్యులు సేకరించారు.వలసపాడు కేంద్రీయ విద్యాలయ విద్యార్ధులు అస్వస్థతకు గురి కావడం పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆరా తీశారు. కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి బొత్స.. ఘటనా స్థలానికి ఉన్నతాధికారులను పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.