అంతరిక్షం యానం పై బిజినెస్ మొదలెట్టిన ప్రపంచ కుబేరులు

అంతరిక్షం యానం పై బిజినెస్ మొదలెట్టిన ప్రపంచ కుబేరులు
క్యాపిటల్ వాయిస్, రాష్ట్ర ప్రతినిధి :- అంతరిక్షం…అనంతం. ఎంత తెలుసుకున్నా కూడా ఇంకో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అలాగే అందరికి అంతరిక్షం గురించి ఇంకా ఎదో కొత్తగా తెలుసుకోవాలని కూడా ఉంటుంది. ఇక అంతరిక్షంలో ప్రయాణం చేయడం అనేది అందరికి ఓ కల. విమానాల్లో ప్రయాణాలు మొదలైన తర్వాత అంతరిక్షం లోకి వెళ్లాలనే కల రోజురోజుకి పెరిగిపోతుంది. రష్యా వ్యోమగామి యూరిగగారిన్ ఎప్పుడేతే అంతరిక్షంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి మరింత ఆసక్తి నెలకొన్నది. అంతరిక్షం గురించి పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంటరయ్యాక ఒక్కసారిగా పోటీ విపరీతంగా పెరిగిపోయింది. వర్జిన్ గెలక్టిక్ బ్లూఆరిజిన్ స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధన మొత్తం అంతరిక్ష యాత్ర చుట్టూనే జరుగుతున్నాయి.అంతరిక్ష విమానంలో కూడా ప్రయాణం చేయాలని ఎంతో మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం వర్జిన్ గెలక్టిక్ లు బ్లూఆరిజిన్ లు స్పేస్ షిప్ లను తయారు చేస్తున్నాయి. జులై 11 వ తేదీన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కు చెందిన స్పేస్ షిప్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. 90 నిమిషాల పాటు ఈ యాత్ర సాగింది.యాత్ర విజయవంతం కావడంతో రాబోయో రోజుల్లో స్పేస్ యాత్రను కమర్షియల్గా ప్రారంభించేందుకు వర్జిన్ గెలాక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. ప్రపంచ కుబేరుడు వర్జిన్ గ్రూప్ సంస్థల అధినేత రిచర్డ్ బ్రాన్సన్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. నింగికి ఎగిసిన వ్యోమనౌక గంట తర్వాత సురక్షితంగా తిరిగివచ్చింది. రిచర్డ్ బ్రాన్సన్ మరో ఐదుగురు వ్యోమగాములతో కూడిన యూనిటీ-22 నౌక సురక్షితంగా భూమిపై ల్యాండైంది. భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న రిచర్డ్ బ్రాన్సన్ ఆశలకు ఈ విజయం మరింత ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.