AMARAVATHIAndhra Pradesh

ఆంధ్రాలో నాలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం….నీట మునిగన ఇళ్లు, పంట పొలాలు

ఆంధ్రాలో నాలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం….నీట మునిగన ఇళ్లు, పంట పొలాలు

క్యాపిటల్ వాయిస్, అమరావతి :- నాలుగు జిల్లాల్లో వాన బీభత్సం.. నీట మునిగన ఇళ్లు.. పంట పొలలాలు.. తిరుమలలో ఘాట్ రోడ్లు అధికారులు మూసివేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్  లో వాన బీభత్సం సృష్టించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలలను వాన ముంచెత్తుతోంది. వర్షాల ధాటికి నెల్లూరు  నగరం పూర్తిగా నీట మునిగింది. ఇక తిరుపతిలోనూ  ఇదే పరిస్థితి కనిపించింది. కడప నగరాన్ని కూడా వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. బాధితులకు తక్షణ ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్  అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు, కాలువలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువ కావడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకూ అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుపతి ఘాట్‌రోడ్లు రెండింటినీ శుక్రవారం ఉదయం వరకు మూసేశారు. రేణిగుంట విమానాశ్రయం, రుయాసుపత్రి నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతిని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. తూర్పు, పడమర ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. రహదారులపై వృక్షాలు కూలిపడ్డాయి. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 13 మండలాల్లో 402 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. తిరుపతి నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. గాలులకు భారీ వృక్షాలు భవనాలపై పడటంతో నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. జిల్లాలోని జలాశయాల గేట్లన్నీ దాదాపు ఎత్తేశారు. రామచంద్రాపురం మండలం పీవీపురం వాగులో సరళ అనే మహిళ గల్లంతు కావడంతో గ్రామస్థులు గాలిస్తున్నారు. తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఆరు విమానాలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. విద్యాసంస్థలన్నింటికీ గురు, శుక్రవారాలు సెలవు ప్రకటించారు. తిరుమల, న్యూస్‌టుడే: భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లను మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది. వీటిని గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రెండు ఘాట్‌రోడ్లలో విరిగిపడిన కొండచరియలను అధికారులు తొలగిస్తూ రాకపోకలను పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో 10 నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. 8 పునరావాస కాలనీల్లో 400 మందికి ఆశ్రయం కల్పించారు. సోమశిల రిజర్వాయరుకు వచ్చే వరద 28వేల క్యూసెక్కులకు పెరగడంతో.. అవుట్‌ ఫ్లోను పెంచారు. దొరవారిసత్రం రైల్వేస్టేషన్‌లో సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతినడంతో.. హావ్‌డా, బెనారస్‌, పినాకిని ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతులో నీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, బుజబుజ నెల్లూరుతో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానల ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 12కు పైగా మండలాల్లో దాదాపు 3,500 ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అటు కడప జిల్లాలోనూ వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉంది. భారీ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు….
వాయుగుండం చెన్నై సమీపంలో తీరం దాటడంతో… దాని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు. అండమాన్‌ తీరంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణశాఖ పేర్కొంది. ఇది మరింత బలపడి 17న కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!