రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా రైతు భరోసా కేంద్రాలు పని చేయాలి: జేసి

రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా రైతు భరోసా కేంద్రాలు పని చేయాలి: జేసి
క్యాపిటల్ వాయిస్,(అనంతపురంజిల్లా) అనంతపురం :- రైతు భరోసా చైతన్య యాత్రను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. జూలై 23 వరకూ ఆర్బీకేలు కేంద్రంగా జిల్లా వ్యాప్తంగా చైతన్య యాత్ర కొనసాగనుందని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా రైతు భరోసా కేంద్రాలు వ్యవహరించాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే పథకాల గురించి అవగాహన కల్పించడం, ఆ పథకాలు వారికి అందేలా కృషి చేయడంతో పాటు. గ్రామ స్థాయిల్లో ప్రభుత్వం దృష్టికి రాని రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే సాధనాలుగా ఆర్బీకేలు పని చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటికే దాదాపు రెండు వందల ఆర్బీకేలు నిర్మించామని రానున్న రోజుల్లో జిల్లాకు మంజూరైన దాదాపు 900 ఆర్బీకే నిర్మాణాలు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. నూతనంగా ఊపిరి పోసుకుంటున్న ఆర్బీకే వ్యవస్థ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెండు వారాల రైతు భరోసా యాత్రను చేపట్టామన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతుల మేలు కోసం గ్రామ స్థాయిలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాల గురించి రైతులకు అవగాహన కల్పించి,వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అందే సేవల గురించి ప్రజలకుతెలియజేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మాత్రమే అందించేందుకు రెండంచెల టెస్టింగ్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. రైతుల్లో అవగాహన లేకపోవడం వల్ల మార్కెట్ లో డిమాండ్ లేని పంటలను పండించడం తద్వారా నష్టపోవడం జరుగుతోందని. ఉదాహరణకు జిల్లాలో బోరు బావుల ద్వారా మార్కెట్లో డిమాండ్ లేని వరి రకాన్ని పండించి రైతులు ఇబ్బందులు పడ్డారని, ఈ ఖరీఫ్ సీజన్ లో అలాంటి పరిస్థితులు రాకుండా రైతు భరోసా కేంద్రాలు పని చేయాలన్నారు. ఇవేగాక విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిధ పంటల్లో విత్తన శుద్ధి, భూసార పరీక్షల ఆధారంగా వివిధ పంటల్లో ఎరువుల వాడకంపై అవగాహన, పోషక లోపాలు వాటి సవరణ పై అవగాహన,వ్యవసాయ యాంత్రీకరణ కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, పంటసాగుదారల హక్కు పత్రం , ఈ క్రాప్ బుకింగ్, డా. వై ఎస్.ఆర్. పొలంబడి వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, అనిమల్ హస్బెందరీ జేడీ వెంకటేశులు,ఆత్మా మద్దిలేటి, ఫిషరీస్ డీడీఏ చంద్రశేఖర్ రెడ్డి, మండల అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త రామసుబ్బయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.