అమరావతి రైతులు మరో మహా పాదయాత్ర కు సిద్ధం – త్వరలో వెయ్యి రోజులకు చేరుకుంటున్న ఉద్యమం

అమరావతి రైతులు మరోమహాపాదయాత్ర కు సిద్ధం – త్వరలో వెయ్యి రోజులకు చేరుకుంటున్నఉద్యమం
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- అమరావతి రైతులు మరో మహా పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం వెయ్యి రోజులకు చేరుతోంది. దీంతో..తొలి విడతగా న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో పాదయాత్ర చేసిస రైతులు రెండో యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈసారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా సూర్యభగవానుడు కొలువైన అరసవల్లి వరకు యాత్ర చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 12వ తేదీకి ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి కానుంది. ఆ రోజునే రెండో విడత మహా పాదయాత్ర ప్రారంభించనున్నారు.మందడంలో యజ్ఞంతో రైతుల పాదయాత్ర ప్రారంభం కానుంది. సుమారు 60 రోజులు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. తొలి విడత పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతి చేరుకుంది. ఈ సారి క్రిష్ణా.. ఉభయ గోదావరి.. ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా అరసవల్లి చేరుకొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ పాదయాత్రకు అసెంబ్లీ నుంచి అరసవల్లి పేరుతో కొనసాగించనున్నారు. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. రాజధాని నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని అమరావతి ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి కోసం చేపట్టనున్న ఈ యాత్ర దాదాపుగా 70 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐకాస నేతలు చెబుతున్నారు.650 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. నవంబర్ 14వ తేదీన అరసవల్లిలో యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ముగింపు సభకు కేంద్ర మంత్రి హాజరు అవుతారని చెబుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతల నుంచి అమరావతి ఐకాస నేతలకు స్పష్టమైన హామీ లభించింది. అమరావతి కి బీజేపీ సహకరిస్తుందని పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో నిర్వహించిన పాదయాత్ర సమయం లోనూ స్పష్టత ఇచ్చారు. పాదయాత్రకు ముందు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులు పూర్తి కానుండటంతో వెంకటపాలెంలో బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు.ఈ సభకు అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించనున్నారు. దీనికి సంబంధించి అన్ని పార్టీల అధినేతలను కలిసి ముందస్తు సమాచారం ఇచ్చారు. ఆ నేతలంతా సభకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా వేడెక్కుతుండటంతో..రాజధాని అంశంలోనూ మరింత ఒత్తిడి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని అమరావతి జేఏసీ భావిస్తోంది. దీంతో..ఇప్పుడు రాజకీయంగా అమరావతి అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారనుంది.