అమరావతి ప్రాంత రైతులు రెండో దశ ఉద్యమానికి శ్రీకారం – అరసవెల్లి వరకు పాదయాత్ర !

అమరావతి ప్రాంత రైతులు రెండో దశ ఉద్యమానికి శ్రీకారం – అరసవెల్లి వరకు పాదయాత్ర !
క్యాపిటల్ వాయిస్, అమరావతి :- మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇవ్వాళ్టి నుంచి మలిదశ పాదయాత్రను చేపట్టనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గల సూర్యభగవానుడి ఆలయం వరకు కొనసాగతుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని, అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహా పాదయాత్రను ఆ ప్రాంత రైతులు చేపట్టారు. వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద దీనికి నాంది పలికారు. తెల్లవారుజామున 5 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి దీన్ని నిర్వహిస్తోంది.తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేన, వామపక్షాలు.. మూడు రాజధానులను వ్యతిరేకిస్తోన్నాయి. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు కూడా ఈ యాత్రలో భాగస్వాములు కానున్నారు. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం మీదుగా శ్రీకాకుళంలోని అరసవల్లి వరకు యాత్ర కొనసాగనుంది. మలిదశ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు యాగాన్ని నిర్వహించారు. మందడం లోని దీక్షా శిబిరంలో యాగం చేశారు.ఇదివరకు అమరావతి ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పేరిట తొలిదశ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అమరావతి నుంచి తిరుపతి వరకు కాలినడకన వెళ్లారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గుండా మొత్తం 400 కిలో మీటర్ల మేర యాత్ర సాగింది. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్టు ఇటీవలే అనుమతులు మంజూరు చేసింది.ఈ నెల 15వ తేదీ నుంచి ఆరంభం కాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో- అమరావతి ప్రాంత రైతుల మలిదశ పాదయాత్రకు ప్రాధాన్యతను సంతరించుకుంది. పాదయాత్ర కొనసాగుతున్న సమయం లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చనే ప్రచారం సాగుతోంది.